చమురు ధరల్లో ఏపీనే అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

చమురు ధరల్లో ఏపీనే అగ్రస్థానం

May 20 2026 2:04 AM | Updated on May 20 2026 2:04 AM

చమురు ధరల్లో ఏపీనే అగ్రస్థానం

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల: పెట్రోలు, డీజిల్‌ రేట్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు, లోకేష్‌, పవన్‌లు తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని ప్రతి మీటింగ్‌లలో ఊదరగొట్టారన్నారు. పెట్రోలు, డీజిల్‌ రేట్లు తగ్గిస్తామని వారి ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పెట్రోలు, డీజిల్‌ రేట్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారని ధ్వజమెత్తారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో తీవ్ర డీజిల్‌ కొరత ఏర్పడటానికి కూడా కూటమి ప్రభుత్వమే కారణమైందని మండిపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ సర్కారును తూర్పారబట్టిందని పేర్కొన్నారు. పెరిగిన పెట్రోలు, డీజిల్‌ వల్ల రవాణా, రైతాంగం, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అనైతిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అనంతరం ఎంపీ ప్రజా దర్బార్‌ నిర్వహించారు.

కష్టపడే వారికి గుర్తింపు: ఇటీవల పార్టీ పదవులు పొందిన పలువురు నాయకులు మంగళవారం ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిశారు. తమపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఎంపీ వారికి సూచించారు.

ఎంపీకి సన్మానం: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని మడూరుకు చెందిన రైతులు కలిసి సన్మానించారు. ఇటీవల ఎంపీ సొంత నిధులతో మడూరు – బొజ్జాయిపల్లెకు చెందిన వంకలో పైపులైన్‌ ఏర్పాటు చేసి రాకపోకలకు రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. దీనికి రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement