కడప సెవెన్‌రోడ్స్: ప్రతి భూమికి స్పష్టమైన హక్కులు కల్పించేలా భూ రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, వివాదరహితంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సభాభవన్‌లో జిల్లాలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, మండల సర్వేయర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, సంబంధిత రెవెన్యూ అధికారులతో ‘రీసర్వే రివైజ్డ్ ఎస్‌ఓపీ– రీసర్వే ఆన్‌లైన్ మాడ్యూల్స్’పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్, కడప మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎస్. భావన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీసర్వే కార్యక్రమంలో భూ రికార్డుల శుద్ధి, గ్రామ సరిహద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల రక్షణ, గ్రౌండ్ ట్రూతింగ్, ల్యాండ్ పార్సెల్ మ్యాపింగ్, వివాదాల పరిష్కారం వంటి ప్రతి దశలో అధికారులు ఎస్‌ఓపీ ప్రకారం ఖచ్చితంగా పనిచేయాలని సూచించారు. రీసర్వే ప్రారంభానికి ముందు గ్రామ సభలు నిర్వహించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, షెడ్యూల్, విధానాలు, ప్రయోజనాలు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఆక్రమణలకు అవకాశం లేకుండా స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేయాలని తెలిపారు. భూవివాదాలు తలెత్తిన సందర్భాల్లో చట్టపరమైన విధానాల ప్రకారం విచారణలు నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ డాక్టర్ నిధి మీనా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మల్లికార్జునుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు మురళి, శిరీష, చంద్ర మోహన్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


