కడప ఎడ్యుకేషన్: వ్యక్తిగత వివరాలు, పాస్వర్డులు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోవద్దని సైబర్ క్రైమ్ విభాగం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మధు మల్లేశ్వర రెడ్డి పేర్కొన్నారు. కడప తెలుగు గంగ కాలనీలో 30 ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో మంగళవారం ‘సైబర్ నేరాలపై అవగాహన‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ లింకులు, మెయిల్స్ తెరవకూడదన్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడగడం, వాట్సాప్ ద్వారా మోసపూరిత సందేశాలు పంపడం వంటి సైబర్ మోసాలపై క్యాడెట్లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 30 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సంబంధిత విషయాలను ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ లలిత్ బాబు, నీలయ్య తదితరులు పాల్గొన్నారు.


