నేడు బంగారు దుకాణాల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు బంగారు దుకాణాల బంద్‌

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

ప్రొద్దుటూరు : ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు నిరసనగా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్‌ పిలుపు మేరకు ప్రొద్దుటూరులో మంగళవారం బంగారు దుకాణాలు బంద్‌ చేయనున్నారు. తాలూకా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాష, యు.ఇలియాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం సమర్పించి, స్వర్ణకార సంఘం భవనంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

21న మహిళల క్రికెట్‌ ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఈ నెల 21న సీనియర్స్‌, అండర్‌ –23, అండర్‌ –19, –అండర్‌ –15 మహిళల క్రికెట్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ వైఎస్సార్‌ డిస్టిక్‌ కార్యదర్శి రెడ్డి ప్రసాద్‌ తెలిపారు. ఎంపికలకు హాజరయ్యేవారు ఆధార్‌ కార్డు కాపీ, బర్త్‌ సర్టిఫికెట్‌, టెన్త్‌ మార్క్‌ లిస్ట్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో తీసుకురావాలన్నారు. ఉదయం 8 గంటలకు వైఎస్‌ఆర్‌ఆన్‌ ఏసీఏ స్టేడియంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు.

మహిళా భవన్‌కు తాళం!

తొండూరు : విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా డ్యూటీలకు హాజరవుతున్నారు. ఇదిగో తాళం వేసి ఉన్న మహిళా భవన్‌ చిత్రమే ఇందుకు సాక్ష్యం. అప్పుల కోసం, పొదుపు ఖాతా ల వివరాల కోసం, పథకాల సమాచారం కోసం ఉదయం 9:30 నుంచి కార్యాలయం వద్ద వేచి ఉన్న డ్వాక్రా మహిళలు ఉదయం 11 దాటినా అధికారులు రాకపోయేసరికి నిరాశగా వెనుదిరిగారు. ‘రోజు కూలీ వదులుకొని వస్తే తాళం వేసి ఉంది. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని’ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాలు వారానికి 6రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండాలి. కానీ సిబ్బంది నిర్లక్ష్యం, సమయపాలన లోపంతో మహిళలు గంటల తరబడి వేచి ఉండి వెళ్లిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి.

పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలి

– డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి

కడప అగ్రికల్చర్‌: ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథక వంట సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి అన్నారు. కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సోమ వారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సబంధించిన వంటవారికి, నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమె మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా ప్రతి ఒక్కరికీ మంచి అనుభవం వస్తుందన్నారు. కేవీకే సీనియర్‌ శాస్త్రవేత, అధిపతి వి శిల్పకళ పలు సూచనలు చేశారు. కేవికే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రశాంతి పాల్గొన్నారు.

సప్లిమెంటరీ పరీక్షలు

పకడ్బందీగా నిర్వహించాలి

– ఆర్‌.ఐ.ఓ, టి.ఎన్‌ వెంకటేశ్వర్లు

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐఓ టీఎస్‌ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం కడప మరియాపురంలోని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కాలేజ్‌ సెమినార్‌ హాల్‌లో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ ఆఫీసర్లకు పరీక్షల నిర్వహణపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎగ్జామినర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జిల్లాలో 46 కేంద్రలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండన్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు రెండు సెషన్స్‌లలో జరుగుతాయని తెలిపారు. డి.ఇ.సి.మెంబర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement