కడప అగ్రికల్చర్: పంటల సాగులో విత్తన ఎంపిక చాలా ముఖ్యమని మహానంది వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ ఎ.వీరయ్య పేర్కొన్నారు. కేవీకే ఆధ్వర్యంలో కడప సమీపంలోని తాడిగొట్ల గ్రామంలో సోమవారం మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడు తగిన ప్రతిపలం లభిస్తుందన్నారు. సమయానికి చీడ పీడలను గుర్తించి సకాలంలో సస్యరక్షణ చర్యల ద్వారా పంట ఖర్చును తగ్గించుకోవడమే కాక అధిక దిగుబడులను కూడా సాధించవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. వి. శిల్పకళ , ఏరువాక కేంద్ర సమన్వయకర్త డాక్టర్ కృష్ణప్రియ, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి డా. పి. పద్మజ, మృత్తికా విభాగం సహాయాచార్యులు డా. పి.వి. గీత తదితరులు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు సమీకృత వ్యవసాయ పద్దతులు, నేల, నీటి సంరక్షణ పద్ధతులు, సోలార్ న్సింగ్ వంటి అంశాలపై ప్రతిమలను, విత్తనాలను, చార్ట్ లను, మోడల్స్‌ను ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
మహానంది వ్యవసాయ కళాశాల
డీన్ డాక్టర్, ఎ వీరయ్య


