ఒంటిమిట్ట : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఒంటిమిట్ట చెరువులో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలింది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు..రామతీర్థం సమీపాన ఉన్న ఒంటిమిట్ట చెరువు కట్ట పక్కనే ఉన్న చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలి ఉండటం గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. చీకటి పడటంతో చెరువులో ఉన్న మృతదేహాన్ని మంగళవారం ఉదయం బయటికి తీయనున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహం బయటకు వచ్చేంత వరకు మృతుడి వివరాలు కానీ, ఆనవాళ్లు కానీ తెలుపలేమని సీఐ స్పష్టం చేశారు.
ఆలంఖాన్‌పల్లెలో..
చెన్నూరు (వల్లూరు) : చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలంఖాన్‌పల్లె ఇర్కాన్ సర్కిల్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 సంవత్సరాలు వుంటుందని తెలిపారు. నీలం రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి కుడి చేతి మీద కరీం సాహెబ్, మెహరునీస్సా అని, కుడి మణికట్టు మీద టాబు అని, ఎడమ చేతి మీద అబ్దుల్ ఖాదర్ అని ఆంగ్ల భాషలో పచ్చ బొట్టు రాసి ఉన్నట్లు వివరించారు. ఇతని మరణానికి గల కారణాలు తెలియాల్సి వున్నదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


