జమ్మలమడుగు రూరల్ : కట్టుకున్న భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన సంఘటన జమ్మలమడుగు పట్టణంలో చోటు చేసుకొంది. ఎస్‌ఐ రామకృష్ణ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగలకట్ట వీధిలో ఉంటున్న లక్ష్మీదేవి, వెంకటేశ్వరరెడ్డి దంపతులు పిల్లలతో కలసి ఉంటున్నారు. వెంకటేశ్వరరెడ్డి వృత్తి రీత్యా బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సోమవారం గొడవ జరిగి లక్ష్మీదేవి మెడపై వెంకటేశ్వరరెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఐచర్ వాహనం
పుంగనూరు : పట్టణంలోని బైపాస్ రోడ్డులో మరమ్మతుకు వచ్చి రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని ఐచర్ వాహనం ఢీకొన్న సంఘటన సోమవారం వేకువజామున జరిగింది. కడప నుంచి వి.కోటకు సిమెంటు లోడ్డుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉండగా, మదనపల్లె నుంచి పలమనేరు వైపుగా వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.


