మైదుకూరు : మైదుకూరులో సోమవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విత్తన దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.3.87 లక్షల విలువైన జీలుగలు, పిల్లి పెసర విత్తనాలను సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పి.శ్రీనివాసులరెడ్డి, విజిలెన్స్ ఏఓ లక్ష్మణ్ కుమార్, విజిలెన్స్ డీసీటీఓ ఖాజా హుస్సేన్, మైదుకూరు ఏఓ బాలగంగాధర్ రెడ్డి, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ రఫీ పట్టణంలోని విత్తనాలను విక్రయించే దుకాణాలపై దాడులు చేశారు. స్థానిక బద్వేలు రోడ్డులోని శ్రీపవిత్ర సీడ్స్ గోడౌన్‌లో సరైన అనుమతులు లేకుండా ఉన్న జీలుగ, పిల్లి పెసర విత్తనాల నిల్వలను గుర్తించారు. గోదాములోని రూ.3.57 లక్షల విలువైన 5,100 కిలోల జీలుగలు, రూ.30 వేల విలువైన 50 కిలోల పిల్లి పెసర విత్తనాలను సీజ్ చేశారు. దుకాణం యజమానిపై 6(ఏ) కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాట్లాడుతూ సరైన అనుమతులు లేకుండా ఎవరైనా విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.3.87 లక్షల విలువైన విత్తనాలు సీజ్


