గోపవరం : మండల తహసీల్దారు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఓ వీఆర్‌ఓ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారపార్టీ అండతోనే రెచ్చిపోతున్నాడు. ఆ వీఆర్‌ఓ పరిధిలో నేషనల్ హైవే, నేషనల్ హైవే నుంచి గోపవరం వరకు రెండు మార్గాల్లో రోడ్డుకు ఇరువైపులా విలువైన ప్రభుత్వ స్థలాలు ఉండటంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాడు. అనుమతులు అన్నీ ఉన్నా ఏ చిన్న కట్టడం కట్టాలన్నా ఈయన అనుమతి తప్పనిసరైంది. ఇంటి స్థలాలకు సంబంధించి పత్రాలన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో పనులు మొదలు పెడితే వెంటనే వెళ్లి ఆ పనులను నిలుపుదల చేయడం అతనికి పరిపాటిగా మారింది. ఎక్కడైతే ఖాళీగా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని సాకుగా చూపించి కొందరికి లేనిపోని ఆశలు కల్పించి వారి నుంచి భారీగా ముడుపులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు చివరిలో ఆ వీఆర్‌ఓ రిటైర్డ్ కానుండటంతో దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశంతో ముడుపుల కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. జాతీయ రహదారి పక్కనే ఉన్న 168/1 సర్వే నంబర్‌లోని 49 సెంట్లలో ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలు లేకపోగా కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. గోపవరం ప్రాజెక్టుకాలనీకి సమీపంలో ఏకంగా ఒరవకాలువను పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగిస్తున్నా వారిపై కనీసం చర్యలు తీసుకోకపోగా వారి వద్దనే ముడుపులు వసూలు చేసినట్లు సమాచారం. గతంలో పనిచేసి బదిలీపై వెళ్లిన తహసీల్దారు పేరు చెప్పి కూడా భారీగా ముడుపులు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఆ తహసీల్దారు సదరు వీఆర్‌ఓను దూరం పెట్టినట్లు తెలిసింది. ఇక మ్యుటేషన్ విషయంలో కూడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం, సకాలంలో పనులు చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం ఇతనికి అలవాటే. ఎవరైనా ప్రశ్నిస్తే నా వెనుక ఏకంగా టీడీపీ ఇన్‌చార్జి ఉన్నారని బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులు వీఆర్‌ఓ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఇదే వీఆర్‌ఓ గతంలో ఓ ప్రభుత్వ భూమిని మరొకరికి ఆన్‌లైన్ చేసిన విషయంలో అప్పటి జేసీ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఆ వీఆర్‌ఓ ఆగడాలకు సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
అధికారపార్టీ అండతో
రెచ్చిపోతున్న వైనం


