పులివెందుల : పులివెందుల పట్టణంలో స్థానిక వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో గత 18ఏళ్ల నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆ ప్రాంతంలో బస్సులు ఎక్కే ప్రయాణికుల కోసం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేవారు. అక్కడే ప్రయాణికులు సేద తీరేందుకు శాశ్వతంగా షెడ్డు ఏర్పాటు చే యాలని వరప్రసాద్ సంకల్పించారు. ఈ విషయాన్ని గత మున్సిపల్ చివరి కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. కౌన్సిల్ ఆమోదం కూడా తెలిపింది. అనంతరం వరప్రసాద్ అక్కడ షెడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే టీడీపీ నాయకులు నీచ బుద్ధిని బయటపెట్టారు. అక్కడ శాశ్వత చలివేంద్రం ఏర్పాటు చేయడం, ప్రజలకు సౌకర్యం కల్పించడం ఏమాత్రం నచ్చని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా అప్పటికప్పుడు ఆ ప్రాంతంలో టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టి నాలుగు క్యాన్లతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ చలివేంద్రం ఏర్పాటులో మున్సిపల్ కమిషనర్ మునికుమార్ పాల్గొనడం కొసమెరుపు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ గత 18ఏళ్ల నుంచి ప్రయాణీకులకోసం చలువ పందిరి, చలివేంద్రం ఏర్పాటు చేయటం జరుగుతోందని, ఈ ఏడాది కూడా ఏర్పాటు చేద్దామని నా సొంత డబ్బు ఒక లక్ష రూపాయలతో బస్ షెల్టర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గురువారం పులివెందులలో ఆయన ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ ఈ చలివేంద్రానికి వైఎస్సార్‌సీపీ రంగులు కూడా వేసినట్లు, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వచ్చిన తర్వాత ప్రారంభించాలనుకున్నామని, కానీ బుధవారం టీడీపీ నాయకులు 4 క్యాన్లు పెట్టి టీడీపీ బ్యానర్లు కట్టి నేను వేసిన పందిరి కింద చలివేంద్రం పెట్టారన్నారు. ఎక్కడ వైఎస్సార్‌సీపీకి మంచిపేరు వస్తుందోనని టీడీపీ వారు చేసిన పని సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే ఉంటే సొంత నిధులతో ఎక్కడైనా చలివేంద్రాలు ఏర్పాటు చేయవచ్చని, చిత్త శుద్ధిలేని పనులు చేసి నవ్వులపాలు కావటం మీకు అలవాటే కదా అని అన్నారు. నా తండ్రి, దివంగత వల్లెపు నాగన్న పేరిట బస్ షెల్టర్ నిర్మించాలని మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేయడం జరిగిందన్నారు.
మున్సిపల్ కమిషనర్ ఏమన్నారంటే.. :
దీనిపై మున్సిపల్ కమిషనర్ మునికుమార్‌ను వివరణ కోరగా.. ఆ ప్రాంతంలో శాశ్వత చలివేంద్రం ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలపడం వాస్తవమేనన్నారు. అయితే బుధవారం ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవంలో నేను పాల్గొనలేదని, మున్సిపాలిటీకి సంబంధించిన అడ్డంకులు తొలగించడానికి మాత్రమే అక్కడికి వెళ్లానని తెలిపారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. :
టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యంపై గురువారం మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, మాజీ కౌన్సిలర్లు కోళ్ల భాస్కర్, కిశోర్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
చలివేంద్రం ఏర్పాటులోనూ రాజకీయం


