బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలో ఈ నెల 21, 22వ తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం 7వ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు.గురువారం స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమించాలని అన్నారు. గాంధీ గ్రామస్వరాజ్యం పునాదులపై బీజేపీ అధికార దాహంతో కార్పొరేట్ల రాజ్యం నిర్మిస్తోందని అన్నారు. అనంతరం మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, జిల్లా నాయకులు జి.శివకుమార్, ఆయా మండలాల కార్యదర్శులు వెంకటేష్, వెంకటరమణ, వీరభద్రుడు, గురవయ్య, ఓబయ్య, ఆవాజ్ జిల్లా కార్యదర్శి చాంద్‌బాష, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జకరయ్య, సీఐటీయూ మాజీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయం ఆవరణలో
యువకుడు ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్: వైఎస్‌ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ‘పెన్నార్’కాన్ఫరెన్స్ హాల్ సమీపంలో రాచకుంట మేఘశ్యామ్ (24) గురువారం విష ద్రావణం తాగడంతోపాటు, బ్లేడుతో గొంతును కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న కడప వన్ టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్య తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిన రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటనపై ప్రాథమిక సమాచారం మేరకు పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన రాచకుంట జయశంకర్ కుమారుడు రాచకుంట మేఘశ్యామ్(24) అదే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు ఉన్న ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం మంచిది కాదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలుమార్లు మేఘశ్యాంకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అంతేగాక వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఇదే అంశంపై పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ లో పలుమార్లు ఫిర్యాదులు చేసుకోవడంతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వివాహితను, ఆమె పిల్లలను తన తల్లిదండ్రులు, బంధువులు దాచి పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ యువడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అపస్మారస్థితిలో, వివరాలు చెప్పలేని పరిస్థితుల్లో బాధితుడు రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎస్పీ కార్యాలయంలో విధుల్లో వున్న కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు యువకుడు మేఘశ్యాంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కడప వన్‌టౌన్ సీఐ వి.చిన్న పెద్దయ్య తెలియజేశారు.


