పరిహారం మరిచి.. పరిహాసమా! | - | Sakshi
Sakshi News home page

పరిహారం మరిచి.. పరిహాసమా!

Mar 28 2026 7:40 AM | Updated on Mar 28 2026 7:40 AM

● నాలుగు సీజన్లు పూర్తి కావస్తున్నా పైసా కూడా...

కడప అగ్రికల్చర్‌: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్నదాతలతో ఆటలాడుకుంటోంది. ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతకు పరిహారంతో మందు పూయాల్సింది పోయి నయాపైసా ఇవ్వకుండా పరిహాసమాడుతోంది. వ్యవసాయానికి చేయూతనివ్వకుండా వేధిస్తోంది. కష్టకాలంలో కర్షకులకు వెన్నుదన్నుగా నిలిచే పలు పథకాలకు నిలువునా తూట్లు పొడుస్తోంది. గతేడాది మోంథా తుపాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదు. ఆ గాయం మరవకముందే తాజాగా వారం రోజుల క్రితం జిల్లాలో ఈదురు గాలులు, అకాల వర్షాలు రైతన్నలను నిలువునా దెబ్బతీశాయి. ముఖ్యంగా జిల్లాలో అరటి పంటతోపాటు మొక్కజొన్న, సజ్జపంటలు దెబ్బతిని నష్టపోయారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా ఆ పంటలకు సంబంధించిన నష్టపరిహారం ఇప్పటికి ఇవ్వలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సర్కారు చిత్తశుద్ధితో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచింది. రైతులు ఆర్థికాభివృద్ధికి అడుగడుగునా చేయూతనిచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో అన్నదాతలకు ఉచితంగా అందిన పంటల బీమా పథకాన్ని ఇప్పుడు అనుచితంగా మార్చేసింది.

నిలువునా నష్టపోయిన రైతన్న...

గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఏర్పడిన మోంథా తుపాన్‌ కారణంగా జిల్లా రైతులు భారీగా నష్టపోయారు. జిల్లాలో 3988 మంది రైతులకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 5193.5 ఎకరాలో వరి, మినుము, పత్తి, మొక్కజొన్న, ఉల్లి, పూల పంటలు దెబ్బతిని రూ. 540.26 లక్షల మేర నష్టం వాటిల్లింది. తాజాగా వారం రోజుల క్రితం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 19, 20 తేదీలలో వీచిన ఈదురుగాలులు, అకాల వర్షాలతో జిల్లాలోని 6 మండలాల్లో 21 గ్రామాలలో 107 మంది రైతులకు సంబంధించి 98.40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న, సజ్జపంటలకు నష్టం జరిగింది. అలాగే జిల్లాలోని రాజంపేట, సింహాద్రిపురం, తొండూరు, ముద్దనూరు మండలాల్లో అరటికి సంబంధించి 62 మంది రైతులకు రూ. 156 లక్షల మేర నష్టం జరిగింది. ఇలా వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి అకాల వర్షాలు, ఈదురు గాలులతో జిల్లాలో రూ. 400 లక్షలకుపైగా నష్టం వాటి ల్లినట్లు తెలిసింది.

గతేడాది వచ్చిన మోంథా తుపాన్‌ వల్ల నేలవాలిన వరిపంట కొండాపురంలో నేలవాలిన మొక్కజొన్న పంటను చూపుతున్న రైతు

7 లక్షల దాకా నష్టం...

ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు 13 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలబడిపోయింది. దీంతో 7 లక్షల దాకా నష్టం వచ్చింది. ఎకరాకు 30 క్వింటాల్‌ చొప్పున దిగుబడి వచ్చేది. అలాంటి పూర్తిగా నేలపడిపోయి పనికిరాకుండా పోయింది. పెట్టుబడితోపాటు దిగుబడి కూడా నేలపాలైంది.

– విశ్వనాథరెడ్డి, ఓబన్నపేట, కొండాపురం మండలం

పది లక్షలు నష్టపోయా...

3700 ఆరటి మొక్కలను నాటాను. మొదటికాపు. ఆరటి గెలలతో పొలమంతా నిండుగా పంట ఉండింది. ఉన్నట్లుండి వచ్చిన ఈదురుగాలులు అకాల వర్షంతో గెలలతో సహా చెట్లన్నీ నేలపడిపోయాయి. దీంతో దాదాపు పది లక్షల దాకా నష్టం వచ్చింది. ఒక్క రుపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. – మధుసూదన్‌రెడ్డి, సింహాద్రిపురం

తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి

గతేడాది మోంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. మళ్లీ ఇటీవల అకాల వర్షంతోపాటు ఈదురు గాలలతో జిల్లాలో ఆరటి, మొక్కజొన్న, సజ్జపంట పూర్తిగా నెల పడిపోయి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

– సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

పంట నష్ట పరిహారం కోసం ఏడాదిగా ఎదురుచూపు

గతేడాది తుపాన్లు, వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు

తాజాగా అకాల వర్షాలు, గాలులతోఅరటి, మొక్కజొన్న, సజ్జపంట నష్టం

నాలుగు సీజన్లు ముగుస్తున్నాపైసా విదిల్చని కూటమి సర్కార్‌

ఆందోళనలో అన్నదాతలు

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో చంద్రబాబు ప్రభుత్వం వరిపంటకు సంబంధించి ఎకరాకు రూ. 630, వేరుశనగకు ఎకరాకు రూ. 450, మామిడికి ఎకరాలకు రూ. 1750 చొప్పున రైతుల నుంచి ప్రీమియం కట్టించింది. బాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన 2024 జూలై 12 నుంచి 2026 మార్చి వరకు దాదాపు నాలుగు సీజన్లు పూర్తి అయాయి. బీమా ప్రీమియం చెల్లించినా రైతులకు మాత్రం పంటల నష్ట పరిహారం కింద ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. గతేడాది వరుస తుఫాన్‌లతోపాటు వర్షాలకు పంటల దెబ్బతిన్న రైతులు పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement