● 9వ తరగతి విద్యార్థులకు అవకాశం
● యువికా –2026కు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. విద్యార్థులకు సాంకేతిక, అంతరిక్ష పరిశోధనలపై ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందని సైన్స్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు యువికాకు అర్హులు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇస్రో విడుదల చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు మార్చి 31 లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి గడువును ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. అవి డెహ్రాడూన్(ఉత్తర్‌ఖండ్), తిరువనంతపురం(కేరళ), సూళ్లూరుపేట(అంధ్రప్రదేశ్), బెంగుళూరు(కర్ణాటక), అహ్మదాబాద్(గుజరాత్), హైదరాబాద్( తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ).
● 8వ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కులను 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న వారికి అదనంగా 15 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, సైన్స్‌ఫెయిర్ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాల్గొన్న విద్యార్థులకు 10 శాతం, ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్థులకు 5 శాతం, ఒలింపియాడ్ పరీక్షలో మొదటి మూడు స్థానాలకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆపై స్థాయిలో(గత 3 సంవత్సరాలు) పాల్గొన్న వారికి 5 శాతం, ఆటలపోటీల్లో పాల్గొన్న వారికి 5 శాతం కేటాయించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఇలా..
ఇస్రో ప్రధాన వెబ్‌ౖసైట్‌లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్‌ఆర్‌ఓ.జీవోవి.ఇన్/యువిక.హెచ్‌టిఎంఎల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికై న వారి జాబితాను ఏప్రిల్ 7న విడుదల చేస్తారు. మే 18న విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–2026 ముగింపు సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.
14 రోజుల పర్యటన
9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికైన వారికి ప్రయాణం, భోజనం, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా కల్పిస్తుంది. ఎంపికై న విద్యార్థులను 14 రోజులపాటు శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలు వివరిస్తారు. ఇస్రో సంస్థల్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించవచ్చు, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రో బయాలజీ, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్‌లపై అవగాహన కల్పిస్తారు. అలాగే ఇస్రో చైర్మన్‌తో సంభాషించే అవకాశం కలుగుతుంది.
రిజిస్ట్రేషన్ గడువు : మార్చి 31 వరకు
ఎంపికై న విద్యార్థులు
జాబితా విడుదల : ఏప్రిల్ 7
విద్యార్థులకు ఆహ్వానం : మే 18
యువికా కార్యక్రమం : మే 19 నుంచి 30 వరకు
ముగింపు : మే 31


