ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో త్రేతాయుగాన్ని మళ్లీ గుర్తుకు చేసేలా సంక్షిప్త రామాయణ ప్రదర్శణ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రామాయణంలో ఉన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను బొమ్మల రూపంలో ప్రదర్శించారు. ఇది భక్తులను కనువిందు చేసింది. ఈ ప్రదర్శనలో బాల్యంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పెరిగిన తీరు, సీతా స్వయంవరంలో శివధనుస్సును విరిచిన శ్రీరాముడు, సీతారాముల కల్యాణం, వనవాసంలో బంగారు జింక కొరిన సీత, రావణుడు సీతాదేవిని అపహరించుట, చెట్టు చాటునుంచి వాలిని రాముడు వధించుట, ఆశోక వనంలో ఉన్న సీతను చేరుకున్న హనుమకు చూడామణిని ఇవ్వడం, లంకిణి నోటి నుంచి హనుమంతుడు బయటకు రావడం, వాల్మీకి చెంత లవకుశలు రామాయణ చరితం చెప్పే సన్నివేశాలు ఏర్పాటు చేశారు. త్రేతాయుగంలో జరిగిన సంఘటలను అచ్చం అలాగే బొమ్మల రూపంలో తీర్చిదిద్దారు.


