జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణంలో సామాన్యుడి టిఫిన్ ప్లేటుకు గ్యాస్ సెగ తగిలింది. పట్టణంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడటంతో హోటళ్లు, టిఫిన్ బండ్ల వద్ద ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిత్యం వందలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆధారపడే టిఫిన్ సెంటర్లలో రేట్లు చూసి షాక్‌కు గురవుతున్నారు. గత వారం రోజుల క్రితం వరకు రూ. 30 నుంచి రూ. 40 మధ్య ఉన్న ఇడ్లీ, పూరి, దోశ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్ల ధరలు ఇప్పుడు రూ. 45 నుంచి రూ. 50కి చేరాయి. గతంలో ముగ్గురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి రూ. 90తో టిఫిన్ పూర్తయ్యేది, కానీ ఇప్పుడు కనీసం రూ. 130 ఖర్చు చేయాల్సి వస్తోంది. ధరల పెరుగుదలపై హోటల్ యజమానులను ప్రశ్నిస్తే.. ‘అంతా గ్యాస్ మహిమ‘ అని సమాధానమిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ దొరకడం లేదని, వ్యాపారం సాగాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌ను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు పెట్టి కొనాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. దీనికి తోడు పెరిగిన కూ లీల ఖర్చుల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని టిఫిన్ బండ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు.


