వేంపల్లె: వేంపల్లెలోని పిరమిడ్ నగర్ ప్రాంతంలో ఆదివారం చోరీ జరిగింది. ఈ మేరకు పులివెందుల సబ్ డివిజన్, కడప క్లూస్ టీంలు చోరీ జరిగిన ఇంటిని సోమవారం పరిశీలించారు. బాధితురాలు నర్రెడ్డి లక్ష్మీదేవి కథనం మేరకు... స్థానిక రెడ్డి నగర్‌లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాఘవ రెడ్డి సతీమణి నర్రెడ్డి లక్ష్మీదేవి ఒక్కరే నివాసముంటున్నారు. ఆదివారం ఆమె ఇంటికి తాళాలు వేసి మండలంలోని పాములూరు గ్రామంలో ఉన్న బంధువులు ఇంటికి వెళ్లారు. చుట్టుపక్కల ఎక్కువగా ఇళ్లు లేకపోవడం.. ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు తాళాలను పగులగొట్టి చోరీ చేశారు. పాములూరు నుంచి సాయంత్రం ఇంటికి రాగా చోరీ జరిగిన విషయం బయట పడినట్లు ఆమె తెలిపారు. దొంగలు రెండు జతలు బంగారు కమ్మలు, రెండు వెండి దీపారాధనలు, ఒక్కటి వెండి గ్లాసును చోరీ చేసినట్లు బాధితురాలు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిపై బాధితురాలితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే క్లూస్ టీం పోలీసులు వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు.


