● ఒత్తిడిని అధిగమిస్తేనే మంచి
మార్కులతో ఉత్తీర్ణత
● పరీక్షల సమయంలో ప్రశాంత
వాతావరణమే ప్రధానం
రాజంపేట టౌన్ : ప్రతి విద్యార్థి చదువు విషయంలో టెన్షన్, ఒత్తిడికి గురయ్యేది పదోతరగతి పబ్లిక్ పరీక్షల సమయంలోనే అని విద్యావంతులు చెబుతున్నారు. బాగా చదివే విద్యార్థుల్లోనూ పరీక్షల సమయం దగ్గరపడే కొద్ది ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. ఈనెల 16వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. తొలి రోజు పరీక్షకు వెళ్లేవరకు చాలా మంది విద్యార్థుల్లో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యే వరకు తమ పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. అలాగే ప్రతి కుటుంబంలో ఉండే చిన్న, చిన్న కోపతాపాలు, కుటుంబ సభ్యులపై చిరాకుపడటం వంటి వాటికి దూరంగా ఉన్నప్పుడే ఇంటిలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
దీంతో విద్యార్థుల ఆలోచనలు చదువుపైనే ఉంటుందని, పరీక్షలను బాగా రాయగలరని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు టెన్త్ కీలక మలుపులాంటిదని, అందువల్ల తల్లిదండ్రులు పరీక్షల సమయంలో తమ పిల్లలతో సరదగా ఉండాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రుల పాత్ర కీలకం
టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభానికి తక్కువ రోజులు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలంటే ఈసమయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైంది. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా వారు చూసుకోవాలి. పరీక్షలు పూర్తయినంత వరకు ఇంట్లో చక్కటి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి.
– డాక్టర్ బి.పురుషోత్తం, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజంపేట
తల్లిదండ్రులు ఇలాంటివి చేయకూడదు
ప్రధానంగా పిల్లలపై కోప్పడటం, చిరాకు పడటం చేయకూడదు పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా సున్నితంగా అది తప్పని చెప్పాలి.
పదే, పదే చదువుకోమని ఒత్తిడి చేయకూడదు
స్లిప్ టెస్ట్ వంటి వాటిల్లో ఇతర పిల్లలకు వచ్చిన మార్కులతో పోల్చి తమ పిల్లలను తక్కువ చేసి మాట్లాడ కూడదు
ఫెయిల్ అయితే అనే మాటలతో పిల్లలను దెప్పి పొడవ కూడదు
పరీక్షలు పూర్తయ్యే వరకు తల్లిదండ్రులు కూడా టీవీలకు దూరంగా ఉండాలి.
పిల్లల్లో ఆత్మ విశ్వాసం దెబ్బతినకుండా ధైర్యం చెప్పాలి. మంచి మార్కులతో పాస్ అవుతావు అన్న పాజిటివ్ మాటలను పిల్లలకు చెప్పాలి.
చదువుకునేందుకు ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి విద్యార్థులు పాటించాల్సినవి
పరీక్షల సమయం దగ్గర పడినందున విద్యార్థులు తమ తోటి వారితో పోల్చుకోకుండా ఈ కొన్ని రోజులు సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలి
ప్రతి సబ్జెక్టుకు ప్రణాళిక వేసుకొని చదువుకోవాలి. వెనకబడిన సబ్జెక్టులపై ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని వేకువ జామున చదివితే మంచిది.
టీవీలు, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండాలి.
ఏవైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వెంటనే చెప్పాలి
ఫెయిల్ అవుతామేమో లేక తక్కువ మార్కులు వస్తాయేయో అన్న ఆలోచన పెట్టుకోకూడదు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తామన్న పాజిటివ్ ఆలోచనలతో గడపాలి.
ముఖ్యంగా వేళకు ఆహారం తినడం, కంటినిండా నిద్రపోవడం చేయాలి.
ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం అత్యంత ప్రధానమైనది.
ఆహార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధతీసుకోవాలి.
ఉదయం కొంత సేపు ధ్యానం, యోగా వంటివి చేస్తే ఎంతో మంచిది.
ఎండల తీవ్రత ఎక్కువైనందున నూనె పదార్దాలకు దూరంగా ఉండాలి.


