● వంకలు, వాగులను కూడా వదలని వైనం
● అడ్డుకట్ట వేయని అధికారులు
గోపవరం : ఇటీవల కాలంలో భూకబ్జాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వాగు, వంకపోరంబోకులను కూడా కబ్జాదారులు వదలడం లేదు. ముఖ్యంగా నెల్లూరు – ముంబై (ఎన్‌హెచ్–67) జాతీయ రహదారికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే వాగులు, వంకలను కూడా దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఆదిలోనే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మండలంలో సెంచురీ పానెల్స్ పరిశ్రమ ఏర్పాటు చేయడంతో బద్వేలు నుంచి పి.పి.కుంట వరకు పట్టా, డీకేటీ భూములు కోట్ల రూపాయలు పలుకుతుండటంతో ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపించినా ప్రభుత్వ స్థలంతో పాటు సమీపంలో ఉన్న వాగులు, వంకలను కూడా కబ్జా చేస్తున్నారు. తాజాగా గోపవరం రెవెన్యూ పొలం 1665 సర్వే నంబరులో పట్టాభూమికి సంబంధించి చుట్టూ కాంపౌండ్ గోడ నిర్మించుకుంటున్నారు. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరవకాలువ ఆ మార్గాన వెళుతుంది. ఆ వరవకాలువను కబ్జా చేసేందుకు గతంలో జేసీబీ ద్వారా చదును చేశారు. అయితే అప్పట్లోనే రెవెన్యూ అధికారులు తిరిగి వారి చేతనే వరవకాలువను జేసీబీ ద్వారా తవ్వించారు. అటవీ ప్రాంతం నుంచి ఈ వరవకాలువ ద్వారా వచ్చే నీరంతా దిగువ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లోకి చేరుకుంటాయి. వరవకాలువను పూడ్చడం వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు రాకుండా పోతుందని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వరవకాలువలో సిమెంటు పైపులు వేసి ఆ స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని స్థానికులు తహసీల్దారు జీవన్‌చంద్రశేఖర్‌కు సమాచారం ఇవ్వడంతో సంబంధిత వీఆర్‌ఓను వెళ్లి పరిశీలించాలని తెలిపారు. కానీ రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ వారు పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇదే కాకుండా బద్వేలు నుంచి పి.పి.కుంటకు వచ్చే జాతీయ రహదారికి ఉన్న కల్వర్టులను కూడా ఆక్రమించి ఏకంగా ఇంటి నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారంటే కబ్జాదారుల నుంచి ముడుపులు అందుతుండువల్లేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు భూ ఆక్రమణ, వంక పోరంబోకు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


