రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా మార్చిన చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా మార్చిన చంద్రబాబు

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా మార్చిన చంద్రబాబు

రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా మార్చిన చంద్రబాబు

రాష్ట్రపతి పాలన విధించాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

రవీంద్రనాథ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి కడప : నిజాలు బయటపడినపుడు నియంతలు ఎప్పుడూ హింసకే పాల్పడతారని, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జంగిల్‌రాజ్‌గా మార్చారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని ల్యాబ్‌లు తేల్చడంతో చంద్రబాబు అహం దెబ్బతిందన్నారు. చంద్రబాబును ప్రజలు చీదరించుకుంటున్నారని, అది తట్టుకోలేకనే డైవర్షన్‌ కోసమే ఈ కుట్రలకు తెర తీశారన్నారు. తప్పుడు ప్రచారాలతో ఫ్లెక్సీలు పెట్టి, శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్నది చంద్రబాబు ప్రణాళిక అని, ప్రశ్నించే వారిని అంతం చేయాలన్నదే ఆయన పథకమన్నారు.తనకు సాగిలపడే పోలీసు అధికారులకు ముందే చెప్పిన చంద్రబాబు నాలుగురోజుల్లో నలుగురు కీలక నాయకులపై దాడులు చేయించారన్నారు. సీబీఐ ఛార్జిషీటు ద్వారా ల్యాబ్‌ రిపోర్టులు బయటకు వచ్చిన తర్వాత భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటికి టీడీపీ గుండాలు, విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడుపై వరుసగా దాడులు జరుగుతున్నా ఎక్కడా పోలీసులు గట్టి చర్యలు తీసుకోలేదన్నారు. వీటికి సంబంధించి ఒక్క కేసు పెట్టకపోగా, ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. అదే క్రమంలో రెండు, మూడు రోజులుగా అంబటిపై దృష్టి పెట్టిన టీడీపీ గూండాలను చంద్రబాబు వెనుక నుంచి నడిపించారన్నారు. దాడుల కుట్రకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అన్నారు. పోలీసులు ప్రభుత్వానికి సాగిలపడ్డారని, చట్టాన్ని తుంగలో తొక్కారన్నారు. రక్షణ కల్పించాలిసన కనీస బాధ్యతలను విస్మరించారన్నారు. అంబటిపై హత్యాయత్నం, దాడులు పోలీసులే దగ్గరుండి చేయించారన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు, రాజకీయ నాయకులకు రక్షణ బాధ్యత ఎవరిదన్నారు. ఘటనా స్థలానికి కూతవేటు దరంలో గుంటూరు డీఐజీ, ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయని, గుంటూరుకు అత్యంత సమీపంలోనే డీజీపీ కార్యాలయం, ప్రత్యేక బలగాలు, ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాలు ఉన్నాయన్నారు. వీరి వత్తాసుతోనే హత్యాయత్నం, విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన విఫలమైందని, పరిపాలన యంత్రాంగం కుప్పకూలిపోయిందన్నారు. జంగిల్‌రాజ్‌, ఆటవిక పాలన కనిపిస్తున్న తరుణంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు.

తిరుమల శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డుమాంసం కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌లు గాయపరిచారన్నారు. ఆ శ్యాంపిళ్లలో ఇవేవి లేవని దేశంలోనే డెయిరీ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ తేల్చి చెప్పడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. తిరుమల ప్రసాదం మీద తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేసిన కుట్రలు నిర్వీర్యం కావడంతో వారు సహించలేకపోతున్నారన్నారు. అయినప్పటికీ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ల్యాబ్‌ రిపోర్టులను ఒప్పుకోమన్నట్లుగా ఇంకా రభస చేస్తున్నారని, తాము కోరినట్లుగా ల్యాబ్‌ రిపోర్టులు ఇవ్వాల్సిందే అన్నట్లు వాళ్లు నియంతల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు. రెండు, మూడు రోజుల నుంచి ఎల్లో మీడియా కవరేజీ చూస్తే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ధోరణిని ప్రజలు చీదరించుకోవడంతో వారి తరపున వైఎస్సార్‌ సీపీ నాయకులు, మేధావులు ప్రశ్నిస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు దురుద్దేశంతోనే తన పార్టీ వాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టడంతోపాటు తిరుమల నెయ్యి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీఐ.. సిట్‌ దాఖలు చేసిన ఛార్జిషీటులో మా నాయకుల పేర్లు లేకపోయినప్పటికీ వైఎస్‌ జగన్‌, భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫోటోలు పెట్టి తప్పుడు ప్రచారాలకు దిగారన్నారు. గుంటూరులో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన తప్పుడు ఫ్లెక్సీని అంబటి రాంబాబు కనీసం చింపలేదని, ముందురోజు వెళ్లి ఇలాంటి తప్పుడు ప్రచారాలు సరికాదని హెచ్చరించారన్నారు. రాంబాబు వచ్చేసరికి కర్రలు, రాడ్లు, రాళ్లతో టీడీపీ వాళ్లు ఎందుకున్నారని, వాళ్లు దాడులకు సిద్దంగా ఉంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దారుణంగా తయారైందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement