వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించడం లేదు
ప్రొద్దుటూరు : వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహాన్ని అందించడంలేదని తన వ్యక్తిగత అభిప్రాయంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వెల్లడించారు. స్థానిక పశువైద్య కళాశాలలో శుక్రవారం కిసాన్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కావాల్సినంత నిధులు ఖర్చు పెట్టడం లేదని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత దేశం పెద్ద వ్యవసాయక దేశమన్నారు. ప్రపంచంతోపాటు మన దేశం కూడా చంద్రమండలం పైకి వెళ్లేందుకు పోటీ పడుతోందన్నారు. ఆ రకంగా వ్యవసాయ, పాడిపరిశ్రమ రంగాలు అభివృద్ధి చేయడానికి చొరవ చూపాలన్నారు. వ్యవసాయంలో గిట్టుబాటు కాక రైతులు తమ భూములను అమ్ముకుంటున్నారన్నారు. రైతులంటే ప్రభుత్వంతోపాటు అధికారులందరికి చిన్న చూపేనన్నారు. తాలూకా ఆఫీసుకు వెళ్లినా, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా రైతులను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. దుస్తులతోపాటు అన్ని వస్తువులు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉత్పత్తి అయి పట్టణాలకు సరఫరా అవుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారంతా వ్యవసాయం గిట్టుబాటు కాని కారణంగా పట్టణాలకు వలస వెళుతున్నారని తెలిపారు. చాలా మంది వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. పూర్వ పద్ధతిలోని వ్యవసాయం, పాడి పరిశ్రమ కొనసాగుతోందని, ఆధునిక పద్ధతులు పాటించాలన్నారు. కిసాన్ మేళా ద్వారా రెండు రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.తిరుపతి శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ డాక్టర్ జేవీ రమణ మాట్లాడుతూ కిసాన్ మేళాకు సహకరించిన హైదరాబాద్ భారతీయ మాంస పరిశోధన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కిసాన్ మేళలో వివిధ శాఖల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ రాజు కిశోర్, పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విస్తరణ విభాగం సంచాలకులు డాక్టర్ శోభామణి, ఐసీఏఆర్ మాంస పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బసవారెడ్డి, కడప వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పశుసంవదర్ధకశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ చంద్రానాయక్, జిల్లా ఉద్యాన అధికారి సతీష్, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి రామదీక్షిత్, కేవీకే వనిపెంట ప్రధాన శాస్త్రవేత్త బాలకృష్ణ పాల్గొన్నారు.
కిసాన్ మేళాలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి


