ప్రజలకు పుట్టా వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు పుట్టా వెన్నుపోటు

Jan 29 2026 6:29 AM | Updated on Jan 29 2026 6:29 AM

ప్రజలకు పుట్టా వెన్నుపోటు

ప్రజలకు పుట్టా వెన్నుపోటు

పీఏలతో పాలన చేయిస్తున్న ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ధ్వజం

మైదుకూరు : చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే.. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రజలకు అందుబాటులో లేకుండా వెన్నుపోటు పొడుస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారానికోసారైనా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను వినాలని ఓ వైపు చంద్రబాబు చెబుతున్నా మైదుకూరులో పుట్టా ప్రజలకు అందుబాటులోనే లేడని ఈ సందర్భంగా రఘురామిరెడ్డి ఆరోపించారు. తాను నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, తన హయాంలో స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చానని పేర్కొన్నారు. మైదుకూరులో పెద్దిరెడ్డి, పుల్లయ్య , మాదన్న, బాలకొండయ్య ఉండేవారని, రాజకీయం వారే నడిపేవారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో స్థానిక టీడీపీ నాయకులకు ప్రాధాన్యత లేదని తెలిపారు. ఖాజీపేటలో హరి యాదవ్‌, మైదుకూరులో మిల్లు శీను, దువ్వూరులో తాటి శీనుయాదవ్‌, బి.మఠంలో శివా యాదవ్‌ను పెట్టి పాలన చేయిస్తున్నాడని ఆరోపించారు. మైదుకూరు మండలంలో సుధాకర్‌యాదవ్‌కు 8వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని, ఓట్లు వేసిన వారిని వదిలేసి తన బంధువు మిల్లు శీనుకు అధికారం ఇచ్చాడని అన్నారు. ఎవరైనా అవసరం ఉండి వెళితే తన పీఏలతో మాట్లాడాలని పుట్టా చెబుతున్నారని విమర్శించారు. పీఏలతో పాలన చేయించడం తన రాజకీయ చరిత్రలో మొద టి సారిగా చూస్తున్నానని రఘురామిరెడ్డి అన్నారు. ఇటీవల ఓ ఛానల్‌లో సుధాకర్‌ యాదవ్‌ గురించి వీకెండ్‌ ఎమ్మెల్యే అంటూ కథనం వచ్చిందన్నారు. డిసెంబర్‌, జనవరి నెలల్లో ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చిన తేదీలను గమనిస్తే ఆ కథనం తప్పని, వీకెండ్‌ ఎమ్మెల్యే అని కాకుండా మంత్‌ ఎండ్‌ ఎమ్మెల్యే అని పిలవాలని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. తన ఆరోపణలపై పుట్టా స్పందించకపోయి నా ప్రజలకు తెలియాలనే చెబుతున్నానన్నారు.

నిజాయితీ, అభివృద్ధి మాటల్లోనే..

పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నిజాయితీ ఆయన చెబుతున్న అభివృద్ధి ఎక్కడా కనిపించవని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే కాగానే రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లిన పుట్టా అవినీతిని సహించనని నిజాయితీతో ఉండాలని అక్కడి అధికారులతో అన్నారు. గతంలో ఇక్కడ అవినీతి పెద్దగా లేదని, సుధాకర్‌ యాదవ్‌ వెళ్లి వచ్చాకే అవినీతి పెరిగిందని ఆరోపించారు. దానికి కారణం ఆఫీసులో పుట్టా తన ఏజెంట్లను నియమించడమేనన్నారు. భూములు ఆక్రమిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్న సుధాకర్‌ యాదవ్‌ అధికారంలో ఉన్నందున దమ్ముంటే వాటిని రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌సీపీ హయాంలో తాను మైదుకూరుకు రూ.74 కోట్లతో అభివృద్ధి పనులు మంజూరు చేయించామని తెలిపారు. అందులో సగం పనులు పూర్తయ్యాయని, మిగిలినవి ఎందుకు పూర్తి చేయించలేదో పుట్టా చెప్పాలన్నారు. సంక్రాంతికి చంద్రబాబు కూడా తన సొంతూరికి వెళ్లాడని, ఎమ్మెల్యేకు మైదుకూరులో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనే తీరిక దొరకలేదని విమర్శించారు. ఎన్నికల్లో 22వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని, లేదంటే వ్యాపారం చేసుకోవాలని హితవు పలికారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మహబూబ్‌ షరీఫ్‌, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేపీ లింగన్న, నరసింహారెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, పీవీ రాఘవరెడ్డి, శివరాం, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌, నాగిరెడ్డి, సంజీవరాయుడు, అమరనాథ్‌రెడ్డి, గౌస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement