కదిలింది.. కడప రాయుని రథం
● ఘనంగా రథోత్సవం
● భక్తజనసంద్రంగా దేవునికడప ప్రాంతం
కడప సెవెన్‌రోడ్స్ : గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. జనం.. జనం.. భక్తజన ప్రభంజనమై కడప రాయుని రథం కదిలింది. బ్రహ్మదేవుడు సారధ్యం వహించినట్లుగా అలంకరించిన రథం విశ్వతేజోమూర్తి సూర్యుని సాక్షిగా తేరు మేరు పర్వతంలా జనసంద్రం మధ్యన గంభీరంగా సాగింది. దేవునికడప మాఢవీధులన్నీ జనంతో పోటెత్తాయి. భక్తులు రథంపై స్వామిని దర్శించుకుని జయజయధ్వానాలు చేస్తూ జన్మధన్యమైందని పుల కించిపోయారు. కడప రాయుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రఽథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దేవునికడప వీధులన్నీ జనంతో నిండిపోయాయి. మిద్దెలు, మేడలపై నుంచి కూడా భక్తులు రథంలోని దేవదేవుడిని తిలకించి పులకించారు.
కట్టలు తెగిన ఉత్సాహం
దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో ఉదయం స్వామి వారిని రథంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామిని దర్శించుకోవడంతోపాటు తేరుపై కొలువుదీర్చిన దేవతామూర్తులను దర్శించుకునే అరుదైన అవకాశం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచి దేవునికడపకు రావడం ప్రారంభమైంది. ఉదయం నుంచే సాగిన ఈ దర్శనాలు మధ్యాహ్నం ముగిశాయి. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు తొలి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి రథాన్ని కదిలించారు. దేవునికడప, పాతకడప, మోడమీదిపల్లె యువత కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో కదం తొక్కుతూ రథ చక్రాల కింద కొయ్య మొద్దులు వేసి వెదురు కర్రల సాయంతో రథాన్ని ముందుకు కదిలించారు. ముందువైపు అశేష జన సందోహం పోటీలుపడి గొలుసులతో రథాన్ని లాగుతుండగా, మొక్కులు గల భక్తులు రథ చక్రాల కింద గుమ్మడికాయలను ఉంచి ఆ ముక్కలను ప్రసాదంగా స్వీకరించారు. అర్చకులు అడుగడుగునా రథంపై నుంచి ప్రజలకు స్వామి వారి హారతులిచ్చారు. రథంపై నుంచి యువతను ప్రోత్సహిస్తూ రథోత్సవం సక్రమంగా సాగేందుకు సూచనలిచ్చారు. భక్తుల గోవిందనామ స్మరణలతో దాదాపు నాలుగు గంటలపాటు దేవునికడప మార్మోగింది. ఆ వీధుల్లోని మిద్దెలు, మేడలన్నీ జనంతో నిండిపోయాయి. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మధ్యాహ్నం కదిలిన రథం నాలుగు గంటలపాటు మాడవీధుల్లో పయనించి తిరిగి సాయంత్రం స్వస్థానానికి చేరింది. అనంతరం ధూళి ఉత్సవం నిర్వహించారు. అడుగడుగునా పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించారు. వాహనాల పార్కింగ్‌తోపాటు భక్తుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. స్వామి సేవకులు పలుచోట్ల శీతల పానీయాలు, అన్నదానాలు, అల్పాహారం అందజేశారు.
నేటి కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, 10.30 నుంచి 12 వరకు స్నపన తిరుమంజనం కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6 నుంచి 7 వరకు ఊంజల సేవ, అన్నమాచార్య కీర్తనలు, రాత్రి 8 నుంచి 9 వరకు అశ్వవాహనం, హరికథా కాలక్షేపం నిర్వహిస్తారు.
కదిలింది.. కడప రాయుని రథం


