1న మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ప్రొద్దుటూరు పట్టణంలోని జార్జ్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ సింగం భాస్కర్‌రెడ్డి, ఫోన్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 35 ఏళ్లు పైబడిన మాస్టర్ క్రీడాకారులకు ఈ ఎంపికలు నిర్వహిస్తామన్నారు. 35 ఏళ్లు పైబడిన క్రీడాకారులు మొదలుకొని ప్రతి ఐదేళ్లకు ఒక విభాగం చొప్పున ఎంపికలు జరుగుతాయన్నారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి జిల్లా జట్టు ఎంపిక చేయనున్నారని టోర్నమెంట్ రేఫరి నాగరాజు తెలిపారు. ఎంపికల్లో పాల్గొను క్రీడాకారులు తమ ఎంట్రీలను జనవరి 30వ తేదీలోపు 9440223908, 9440107080 నంబర్లకు పంపాలన్నారు. డబుల్స్‌లో పార్టనర్ పేరు తప్పనిసరి అన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఫిబ్రవరి 22–26వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి మాస్టర్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని అసోసియేషన్ చైర్మన్ జిలానిబాషా తెలిపారు.
లారీ ఢీకొని ఒకరి మృతి
బద్వేలు అర్బన్ : పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రాజుగారివీధికి చెందిన సుబ్బరాయుడు, లక్ష్మిదేవిల కుమారుడైన బత్తలచరణ్ (15) పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవుదినం కావడంతో పూలబావి వీధికి చెందిన తన స్నేహితుడైన కూరాకు వరుణ్‌తో కలిసి మైదుకూరు రోడ్డులో ని ఓ క్రీడా మైదానంలో క్రికెట్ ఆడి స్కూటీలో ఇంటికి బయలుదేరాడు. మైదుకూరురోడ్డులో ని టీఎంఆర్ షాపింగ్‌మాల్ వద్దకు వచ్చేసరికి యర్రగుంట్ల నుంచి బద్వేలుకు సిమెంటు లో డుతో వస్తున్న లారీ వెనుకవైపు నుంచి స్కూటీ ని ఢీకొట్టడంతో చరణ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చొని ఉన్న వరుణ్ చేతికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించడంతోపాటు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే తీవ్ర గాయాలపాలైన వరుణ్‌ను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. మృతుడి తల్లి లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరాజు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ..
ఒంటిమిట్ట : మండలంలోని నరసన్నగారిపల్లిలో ఈ నెల 8వ తేదీన మనవడి చేతిలో కత్తిపోటుకు గురై గాయపడిన వృద్ధురాలు రాఘవమ్మ(75) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు సీఐ నరసింహరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. నరసన్నగారిపల్లి గ్రామానికి చెందిన రాఘవమ్మను కూతురు శ్రీదేవి కుమారుడు నంద(20) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని పొలంలో పని చేసుకుంటున్న ఆమెను ఈ నెల 8న కత్తితో పొడిచి పరారు అయ్యాడు. నిందితుడిని రెండు రోజులకే అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. రాఘవమ్మ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిందని, దీంతో రాఘవమ్మను పొడిచిన మనవడు నందపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో..
అట్లూరు : మండల పరిధిలోని ఎర్రబల్లి ఎస్సీ కాలనీ దగ్గర లింగాల కుంట చెరువు పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగాలకుంట చెరువు పక్కన కంప చెట్లలో కడప– బద్వేలు ప్రధాన రహదారి సమీపాన దుర్గంధం వెదజల్లుతుండటంతో అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించి మగవ్యక్తి మృతదేహం కనిపించిందని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ నాగకీర్తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బద్వేలు రూరల్ సీఐ కృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి ఆనవాలును బట్టి బద్వేలు మున్సిపాలిటీలోని సుమిత్ర నగర్‌కు చెందిన గొడ్లవీటి వెంకటేష్ (70)గా గుర్తించారు. మృతుడు ఈ నెల 21న ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అప్ప టి నుంచి కనిపించడం లేదని బద్వేలు అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన బంధువులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇంటి నుంచి బయల్దేరిన రోజే వెంకటేష్ మృతి చెంది ఉంటాడని, సుమారు నాలుగు రోజులు గడవడంతో గుర్తు పట్టలేని విధంగా మృతదేహం ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి మరణానికి కారణాలు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
1న మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఎంపికలు


