నిఘా నీడలో ‘ప్రయోగం’
● ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు సర్వం సిద్ధం
● పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
● ఈ నెల 27 నుంచి ఒకేషనల్ ప్రాక్టికల్స్
● ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ ప్రయోగ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇంటర్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఒకేషనల్ విభాగం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెగ్యులర్ విభాగం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని వసతులను సిద్ధం చేస్తున్నారు.
ఒకేషనల్ ప్రాక్టికల్స్ 16 కేంద్రాల్లో..
జిల్లా వ్యాప్తంగా జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఒకేషనల్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మూడు స్పెల్స్‌లో ఉంటాయి. జనవరి 27 నుంచి 31 వరకు 10 పరీక్షా కేంద్రాలలో స్పెషల్ –1 ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉదయం 9 నుంచి 12 గంటలకు ఒక సెషన్‌లో, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మరో సెషన్‌లో పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు 6 పరీక్షా కేంద్రాలలో స్పెల్ –2 పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిని కూడా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్‌లో, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మరో షెషన్‌లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు 4 పరీక్షా కేంద్రాలలో స్పెల్–3 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో కూడా రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. ఈ మూడు స్పెల్స్‌కు సంబంధించి 16 పరీక్షా కేంద్రాలలో 2422 మంది విద్యార్థులు ఒకేషనల్ ప్రాక్టికల్స్‌లో పాల్గొనున్నారు.
రెగ్యులర్ ప్రాక్టికల్స్ 81 కేంద్రాల్లో..
జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెగ్యులర్ ఇంటర్ విద్యార్థులకు ఈ ప్రాక్టికల్స్ పరీక్షలను రెండు స్పెల్స్‌లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు స్పెల్–1లో నిర్వహిస్తారు. ఇందులో 51 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్‌లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు మరో సెషన్‌లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు స్పెల్ –2లో 51 పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తారు. ఇందులో కూడా రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. రెండు స్పెల్స్‌కు సంబంధించి 81 పరీక్షా కేంద్రాలలో 13825 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలలో పాల్గొనున్నారు.
144 సెక్షన్ అమలు
ప్రయోగ పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. దీంతోపాటు ఇక్కడి నుంచి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉన్న కంట్రోల్ రూముకు అనుసంధానం చేస్తారు. వీటి ద్వారా ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలలో ప్రయోగ పరీక్షలు ఎలా జరగుతున్నాయని పర్యవేక్షించవచ్చు. వీటితోపాటు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేయనున్నారు. అలాగే స్క్వాడ్ సభ్యులు కూడా పర్యవేక్షించనున్నారు.
పకడ్బందీగా..
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒకేషనల్, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేశాం. ఇందులో భాగంగానే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కట్టదిట్టంగా నిర్వహిస్తాం.
– వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షనాధికారి


