ఆరాధన జనమయం.. ఇస్తేమా ప్రాంగణం | - | Sakshi
Sakshi News home page

ఆరాధన జనమయం.. ఇస్తేమా ప్రాంగణం

Jan 26 2026 4:49 AM | Updated on Jan 26 2026 4:49 AM

ఆరాధన

ఆరాధన జనమయం.. ఇస్తేమా ప్రాంగణం

కడప సెవెన్‌రోడ్స్‌ : కడప నగర శివార్లలోని కొప్పర్తి వద్ద గత మూడు రోజులుగా నిర్వహించిన దీని ఇస్తేమా పరిసమాప్తమైంది. చివరి రోజైన ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఇస్తేమా ప్రాంగణానికి పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి భక్తజనం తరలిరావడం కనిపించింది. ఉదయం నుంచి రైల్వేస్టేషన్‌తోపాటు బస్టాండు ప్రాంతంలో ముస్లింల రద్దీ నెలకొంది. ఫజర్‌ నమాజ్‌ తర్వాత ఆధ్యాత్మిక గురువుల సందేశాల ప్రారంభ సమయానికే లక్షలాది మంది జనం ఇస్తేమా ప్రాంగణంలో ఆశీనులయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు గురువులు, ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు కొనసాగాయి. ఎక్కడ చూసినా భక్తజనంతో ప్రధాన వేదికతోపాటు ఇతర ప్రాంతాల్లో ఇసుకేస్తే రాలనంతగా జనం రద్దీ కనిపించింది. దేశంలోని ప్రముఖ ప్రాంతాలకు చెందిన గురువులు తమ ప్రసంగాల్లో పవిత్ర ఖురాన్‌లోని అంశాలను తెలియజేస్తూ నిరంతరం దైవ మార్గంలో నడవాల్సిన విషయాన్ని పలు ఉదాహరణతో సహా వివరించారు. దైవ ప్రార్థనలతో మానవ జన్మకు సార్థకత చేకూరేలా నడుచుకోవాలని, ప్రతి నిత్యం అల్లాహ్‌కు విశ్వాసపాత్రుడిగా ఉండాలని సూచించారు. అలాగే మానవ జాతిని సన్మార్గంలో నడిపించాలని ప్రార్థించారు.

దైవానికి కన్నీటితో వేడుకోలు

ఇస్తేమా ముగింపు నేపథ్యంలో చివరిగా మత గురువులు చేసిన దువా ద్వారా లక్షలాది మంది అల్లాహ్‌ను కన్నీటితో వేడుకున్నారు. తెలిసి, తెలియకో చేసిన పాపాలను క్షమించాలని, తమకు స్వర్గలోక ప్రాప్తి కల్పించాలని, తమతోపాటు తమ కుటుంబీకులు, బంధుమిత్రులను సన్మార్గంలో నడపించాలని దైవాన్ని ప్రార్థించారు.

గమ్యస్థానాలకు పయనం

ఇస్తేమాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ముస్లింలు ఆదివారం రాత్రి ఇస్తేమా ముగియడంతో తమ గమ్యస్థానాలకు పయనమయ్యారు. కొంతమంది తమ సొంత వాహనాల్లో, మరికొంత మంది రైల్వేస్టేషన్‌, బస్టాండుకు వెళ్లి ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లారు. మొత్తం మీద కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజులపాటు లక్షలాది మంది హాజరైనా.. ఎలాంటి చిన్నపాటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చేసిన ఏర్పాట్లపై ప్రతి ఒక్కరూ అభినందించారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

చివరిరోజు ఇసుకేస్తే రాలనంతగా

తరలివచ్చిన ప్రజలు

కడపలో ముగిసిన మూడు రోజుల

దీని ఇస్తేమా

కొనసాగిన మత గురువులు,

ఆధ్యాత్మికవేత్తల సందేశాలు

మానవుడిని సన్మార్గంలో నడపాలని గురువుల విశేష ప్రార్థనలు

ఆరాధన జనమయం.. ఇస్తేమా ప్రాంగణం1
1/1

ఆరాధన జనమయం.. ఇస్తేమా ప్రాంగణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement