సూర్యప్రభ వాహనంపై సౌమ్యనాథుడు
వైభవంగా కోదండ రాముడి గ్రామోత్సవం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఆదివారం రథసప్తమి పర్వదినాన వేడుకలను టీటీడీ వారు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కి ఆదిత్య హృదయ పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు, బంగారుల ఆభరణాలు తొడిగి తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉదయం 9:30 గంటల నుంచి స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. అడుగడుగునా భక్తులు స్వామి వారికి కాయకర్పూరంతో నీరాజనం పలికారు. రథసప్తమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధి పొందిన వైష్ణవ క్షేత్రమైన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సౌమ్యనాథస్వామిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామి వారు మత్య్సావతారంలో మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయం కిక్కిరిసింది. రాత్రి చంద్రప్రభ వాహనంపై కృష్ణమూర్తి అలంకారంలో అభయమిచ్చారు. భక్తులు కాయ కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దిలీప్‌కుమార్, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
సూర్యప్రభ వాహనంపై సౌమ్యనాథుడు


