విద్యా స్వరూపిణీ నమోస్తుతే...
అక్షరాభ్యాసానికి శ్రేష్టమైన రోజు
నేడు వసంత పంచమి
రాజంపేట టౌన్ : సమస్త విద్యలతో సకల కళలతో అశేష విజ్ఞానదేవి సరస్వతీ అవతరించిన పుణ్యదినమే వసంత పంచమి. మాఘశుద్ద పంచమిరోజు జరుపుకునే ఈ వేడుకను సరస్వతీజయంతి, మదనపంచమి వంటి పేర్లతో కూడా పిలుచుకుంటారు. వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాల్లోవుంది. వసంత పంచమిని విద్య ఆరంభోత్సవ దినోత్సవంగా భావిస్తారు. శుక్ర,వారం పాఠశాలల్లో, దేవాలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. శ్రీసర్వచైతన్య రూపాంతాం ఆద్యం విద్యాం చ ధీమహి బుద్ది యోనఃప్రచోదయాత్‌శ్రీఅంటూ వ్యాసుడు అమ్మకు ఆదీ అంతాలు లేవంటూ స్తుతించాడు. మూల ప్రకృతికి వ్యక్తరూపాలైన గణేశ, రాధ, లక్ష్మీ, సరస్వతి, సావిత్రి రూపాల్లో ఒకరిగా సరస్వతిని దర్శించాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే సరస్వతీదేవిని పూజించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడని ఇతిహాసాల్లో ఉంది. జ్ఞానానికి ఆదిదేవత సరస్వతీ. సరస్వతీ జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు తదితర వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలని పండితులు భావిస్తారు. వసంత పంచమి రోజు అమ్మవారిని తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు.
నేడు సామూహిక అక్షరాభ్యాసం
వసంవతి పంచమిని పురస్కరించుకొని పట్టణంలోని అమ్మవారిశాలలో శుక్రవారం ఉదయం 8–30 నుంచి 10 గంటల లోపు చదువుల తల్లి సరస్వతీదేవి పూజ నిర్వహించి సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే ఉదయం 8 గంటలకు అమ్మవారిశాలకు చేరుకోవాలని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి సరస్వతీదేవికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
మాఘమాసం నవ చైతన్య వికాసానికి, సరస్వతీదేవి మనోవికాసానికి ప్రతీక. అందువల్ల పిల్లల అక్షరాభ్యాసానికి వసంత పంచమి ఎంతో శ్రేష్టమైనది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా సరస్వతీదేవిని పూజించడం వల్ల స్తబ్దత, ఉదాసీనత తొలగిపోతుంది. అలాగే లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి పూజలు నిర్వహించడం, దానాలు చేయడం వల్ల పుణ్యఫలం సిద్దిస్తుంది.
– జనార్దన స్వామి, పురోహితులు, రాజంపేట
విద్యా స్వరూపిణీ నమోస్తుతే...


