సమస్యల పరిష్కారంలో కొరవడిన స్పష్టత
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వంలో స్పష్టత కొరవడిందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఆరోపించారు. శనివారం కడపలోని యూటీఎఫ్ భవన్‌లో జరిగిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కూటమి పెద్దలు ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించడంతోపాటు 12వ పీఆర్సీని అమలు చేసి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తారని ఆశించారన్నారు. అయితే పీఆర్సీ అమలు సంగతి అటుంచితే, పీఆర్సీ చైర్మన్‌ను నియమించడంలో సైతం కాలయాపన చేస్తున్నారన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలను ఆరు మాసాలలోగా రోడ్ మ్యాప్ ప్రకటించి చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 8500 కోట్ల రూపాయల బకాయిలను మాత్రమే చెల్లించిందని, మిగతా 25 వేల కోట్ల బకాయిల చెల్లింపునకు చర్యలు చేపట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను నిర్వహించడం తగదన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు, జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్.ఎజాస్ అహ్మద్, ఎ.శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి.క్రిష్ణారెడ్డి, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ జి.గోపీనాథ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్


