వేతనాల పెంపుకోసం అంగన్వాడీల ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శులు మంజుల, లక్ష్మిదేవిలు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. హెల్పర్ల పదోన్నతులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అన్ని యాప్‌లు కలిపి ఒక యాప్‌గా మార్చాలని, సె ంటర్ నిర్వహణకు 5జీ ఫోన్లు ఇవ్వాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని కోరారు. గ్రాట్యూటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని, వేతనంతోకూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రీ స్కూలు బలోపేతం చేయాలని, పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


