వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌! | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌!

Dec 12 2025 6:33 AM | Updated on Dec 12 2025 6:33 AM

వామ్మ

వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌!

స్క్రబ్‌ టైఫస్‌ పట్ల ఆందోళన అక్కర్లేదు

తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులుంటే నిర్లక్ష్యం చేయొద్దు

అనుమానిత లక్షణాలున్న వారికి

ఆస్పత్రిలోనే నిర్ధారణ పరీక్షలు

ఆందోళన వద్దు..

అప్రమత్తంగా ఉంటే చాలు

ప్రొద్దుటూరు క్రైం : స్క్రబ్‌ టైఫస్‌ అనే జ్వరం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వ్యాధి లక్షణాలతో కొంత మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో కూడా స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలతో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. కడప రిమ్స్‌లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. క్రమేణా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో 51 పీహెచ్‌సీలు, 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బద్వేలు, పోరుమామిళ్ల, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల, చెన్నూరులలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, కడపలో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి అండ్‌ మెడికల్‌ కాలేజీ (రిమ్స్‌) ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి ఉన్నాయి.

అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

స్క్రబ్‌ టైఫస్‌ జ్వరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడంతో పాటు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుజాత ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఓపీ విభాగంలో ఉన్న టీవీల ద్వారా స్క్రబ్‌ టైఫస్‌ జ్వరం గురించి వివరిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎలీసా టెస్ట్‌ నిర్వహించాలని సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర విభాగంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక స్క్రబ్‌ టైఫస్‌ విభాగం

ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆరు బెడ్‌లతో స్క్రబ్‌ టైఫస్‌ ఐసోలేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యాధితో అడ్మిట్‌ అయిన వారికి కావాల్సిన మందులను కూడా ఐసోలేషన్‌ వార్డులోనే సిద్ధంగా ఉంచారు. ఐసోలేషన్‌ విభాగాన్ని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుజాత, ఆర్‌ఎంఓ డాక్టర్‌ శివరాంలు పరిశీలించారు. స్క్రబ్‌ టైఫస్‌ కేసులొస్తే పూర్తి స్థాయిలో చికిత్సను అందించేలా వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు రోజుల క్రితం జిల్లా ఆస్పత్రికి తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో ఒక వ్యక్తి రాగా అనుమానంతో వైద్యులు ఎలీసా టెస్ట్‌ చేశారు. అతనికి డెంగీ జ్వరమని నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజు 800–900 వరకు ఓపీ నమోదు అవుతుంది. జ్వరం సోకి ఆస్పత్రికి వచ్చిన వృద్ధులు, చిన్న పిల్లలను వైద్యులు జాగ్రత్తగా పరీక్షలు చేస్తున్నారు.

స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు

స్క్రబ్‌ టైఫస్‌ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఇది చిగ్గర్స్‌ అనే చిన్న కీటకాల లాంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరంపై కనిపిస్తుంది. ఈ చిగ్గర్స్‌ కీటకాలు పొదలు, గడ్డి, వ్యవసాయ భూముల్లో నివసిస్తాయి. ఇవి కుట్టినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి సోకిన తర్వాత 5–15 రోజుల్లోపు తీవ్రమైన జ్వరం, చలి, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, బలహీనత, మెడ, చంకల్లో వాపు గడ్డలు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. అలాగే పురుగు కుట్టిన చోట ముదురు రంగుతో కూడిన పుండు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షణాలుంటే స్క్రబ్‌ టైఫస్‌గా భావించాలని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయించకపోతే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో పాటు అవయవాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని, సకాలంలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే నాలుగైదు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు తెలిపారు.

స్క్రబ్‌ టైఫస్‌ నివారణ మార్గాలు ఏంటంటే..

స్క్రబ్‌ టైఫస్‌ రాకుండా ఉండాలంటే చేతులు, కాళ్లను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డి, పొదలు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగడంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

జిల్లా ఆస్పత్రిలో రద్దీగా ఉన్న ఓపీ రిజిస్ట్రేషన్‌ విభాగం

జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రబ్‌ టైఫస్‌ ఐసోలేషన్‌ విభాగం

స్క్రబ్‌ టైఫస్‌ జ్వరం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి రావాలి. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి రక్తపరీక్షలు చేస్తున్నాం. ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో ప్రత్యేక స్క్రబ్‌ టైఫస్‌ ఐసోలేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేశాం. చికిత్సకు కావాల్సిన మందులన్నీ ఉన్నాయి. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారు. ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్‌ సుజాత, జిల్లా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌, ప్రొద్దుటూరు.

వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌! 1
1/3

వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌!

వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌! 2
2/3

వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌!

వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌! 3
3/3

వామ్మో.. స్క్రబ్‌ టైఫస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement