ఈశ్వరీదేవి మఠం.. ఉత్సవ శోభితం
కలశోత్సవం నిర్వహిస్తున్న మహిళా భక్తులు విద్యుత్ దీప కాంతులీనుతున్న ఈశ్వరీదేవి మఠం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ ఈశ్వరీదేవిమఠం ఉత్సవ శోభను సంతరించుకుంది. విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతోంది. భక్తజన సందడితో కళకళలాడుతోంది. అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రభాత సేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. మధ్యాహ్నం నివేదన, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. సాయంత్రం సూక్తపారాయణం, అభిషేషకం, కుంకుమార్చన చేశారు. రాత్రి కలశోత్సవం, నైవేద్యం, కలశస్థాపన తదితర కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. ఉభయదాతలుగా గుంటూరుకు చెందిన కోడూరు శివరామ శాస్త్రి, కోడూరు ఫణీంద్ర వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆధ్వర్యంలో ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో దేవదాయ శాఖ, మఠం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ముత్తలూరు ఆంజనేయశర్మ, రఘువు వెంకటసుబ్రమణ్యాచార్యులు, అమ్మవారి శిష్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈశ్వరీదేవి మఠం.. ఉత్సవ శోభితం
ఈశ్వరీదేవి మఠం.. ఉత్సవ శోభితం


