మృతుడి గుర్తింపు
ఎర్రగుంట్ల : ఇటీవల కాలంలో ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుల వివరాలతో స్టేషన్ ఆవరణంలోని జీఆర్‌పీ స్టేషన్ వద్ద సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు ఎర్రగుంట్ల రైల్వే ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం బోర్డులో ఉన్న తండ్రి ఫొటో చూసి గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులను సంప్రదించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల 8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సూచిక బోర్డును చూసి ఏప్రిల్ 8వ తేదీన మృతి చెందిన వ్యక్తి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉంటున్న హాజీపీరా కుమారుడు షేక్ మహబూబ్ బాషాగా కుటుంబ సభ్యులు గుర్తించారన్నారు. మృతుడు మహబూబ్ బాషా ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడని మృతుడి భార్య , కుమారులు వాంగ్మూలం ఇచ్చారని ఎస్‌ఐ తెలిపారు.
కారు ఢీకొని యువకుడి మృతి
చిన్నమండెం : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల కథనం మేరకు.. చిన్నమండెంకు చెందిన పఠాన్ సాహుల్ (22), పఠాన్ రిజ్వాల్(16)లు తమ సొంత పనుల నిమిత్తం బుధవారం రాత్రి రాయచోటికి వచ్చారు. మదనపల్లి బైపాస్ వద్దకు రాగానే వారి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పఠాన్ సాహుల్ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన పఠాన్ రిజ్వాల్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకులకు ఇలా జరగడంపై రెండు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బొలెరో వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు
కలకడ : ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ బావికానివడ్డిపల్లెకు చెందిన అంజి తన ద్విచక్రవాహనంలో సంబేపల్లె మండలం, మోటకట్ల ముదినేనిపల్లెకు చెందిన సి.రమణతో కలిసి బాకివానివడ్డిపల్లెకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బాకివానివడ్డిపల్లె సమీపంలో ద్విచక్రవాహనంపై నిలబడి ఉండగా బాలయ్యగారిపల్లె నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో పికప్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన అంజి, రమణలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


