నిర్ణీత సమయానికే విమానాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల మొదటి వారంలో జరిగిన ఇండిగో సంక్షోభం తర్వాత కడప విమానాశ్రయంలో ప్రస్తుతం విమానాల రాకపోకలు సాధారణంగా సాగుతున్నాయని కడప విమానాశ్రయం డైరెక్టర్ సుజిత్‌కుమార్ పొదార్ తెలిపారు. గురువారం కడప విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సగటున ప్రతిరోజు 200 మంది ప్రయాణికులు కడప విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఈనెల 4వ తేదీ విమానాల రాకపోకల్లో రెండు గంటలకు పైగా ఆలస్యం జరిగిందని, అయితే డిసెంబరు 5వ తేదీ మినహా కడప విమానాశ్రయంలో ఎలాంటి విమానాల రద్దు జరగలేదన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఇండిగో సంస్థ ముందుగానే సమాచారం అందించిందని, అయితే ప్రస్తుతం కడప విమానాశ్రయంలో ప్రయాణికులకు సంబంధించి డెలివరీ చేయాల్సిన బ్యాగులు పెండింగ్‌లో లేవన్నారు. ప్రస్తుతం ఇండిగో హైదరాబాదుకు ప్రతిరోజు, చైన్నె, విజయవాడలకు రోజుమార్చి రోజు విమానాలను నడుపుతోందన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మే ఐ హెల్ప్‌యూ డెస్క్ కూడా త్వరలో ప్రారంభించనున్నామన్నారు. కడప విమానాశ్రయంలో 2023 నుంచి నైట్ ల్యాండింగ్ విమానాలు దిగే సౌకర్యం ఉందన్నారు. ఎయిర్‌బస్, ఏ320 వంటి పెద్దవిమానాలకు అనుకూలంగా ఉండేలా 2022లో రన్‌వేను 2515 మీటర్లకు విస్తరించారన్నారు. కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇవి మార్చి, ఏప్రిల్–2026 నాటికి పూర్తవుతాయన్నారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక కడప విమానాశ్రయం ఒకేసారి ఏడు ఎయిర్‌బస్సు, ఏ320 విమానాలను హ్యాండిల్ చేయగలదన్నారు. కారు పార్కింగ్ ప్రాంతంలో 375 కార్లు, 100 స్టాఫ్ కార్లను పార్కింగ్ చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. అలాగే ఫ్‌లైట్ ట్రైనింగ్ స్కూలు త్వరలో ప్రారంభం కానుందని, ఇది కడప యువతకు భవిష్యత్తులో పైలెట్లుగా మారేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాసో (ఎస్‌ఎఫ్‌ఎస్) కె.ఆర్ముగం, ఆపరేషన్ మేనేజర్ (ఏఏ1) దామోదర్, ప్రొటోకాల్ ఆఫీసర్ షీరిన్ తదితరులు పాల్గొన్నారు.
కడప విమానాశ్రయం డైరెక్టర్
సుజిత్‌కుమార్ పొదార్


