లింగాపురం సొసైటీ స్థలంపై వివాదం
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని లింగాపురం గ్రామంలో ఉన్న ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్‌కు సంబంధించిన స్థలంపై వివాదం నెలకొంది. మూలవారిపల్లె గ్రామానికి చెందిన ఎస్సీ ప్రజలు సొసైటీ స్థలంలో తమకు శ్మశానానికి రస్తా కావాలని గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. అయితే సొసైటీ అధికారులు తమ సొసైటీకి సంబంధించిన స్థలం నుంచి రహదారి హక్కులు లేవని చెబుతుండగా గురువారం ఇటు ప్రజలు, అటు సొసైటీ అధికారుల అర్జీల మేరకు తహసీల్దార్ గంగయ్య, మండల సర్వేయర్ వెంకటలక్ష్మిలు వచ్చి సొసైటీ స్థలాన్ని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 80/1ఏలో సొసైటీకి 51 సెంట్లు స్థలం ఉన్నట్లు తహసీల్దార్ నిర్ధారించారు. అక్కడి ఎస్సీ ప్రజలు సొసైటీకి అంత స్థలం లేదని, ఇందులో ఎన్నో ఏళ్లుగా తామంతా శ్మశానానికి రహదారిగా వినియోగించుకుని వెళుతున్నామని వాగ్వాదం చేశారు. సొసైటీ స్థలానికి ప్రహరీని నిర్మిస్తే తమకు రాకపోకలు ఇబ్బందని, నిర్మాణాలను అడ్డుకుంటామని ప్రజలు అధికారులతో వాదనకు దిగారు. సొసైటీ స్థలంలో ప్రహరీ కట్టుకునే హక్కు సొసైటీ అధికారులకు ఉందని, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా వాడుకుంటే దానికి హక్కు రాదని ప్రజలకు తహసీల్దార్ తెలిపారు. శ్మశానానికి ముందు ఉన్న రహదారిని వినియోగించుకోవచ్చని ఎవరైనా అభ్యంతరం తెలిపితే తనకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ రాజశేఖర్, చైర్మన్ సిద్ధారెడ్డిగారి నాగమునిరెడ్డి, వీఆర్‌ఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు.


