అసాంఘిక కార్యకలాపాలపై కఠిన వైఖరి
కడప అర్బన్ : గ్యాంబ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాల అణచివేతకు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొద్దుటూరు సబ్–డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణాన్ని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్, అధిక వేగంతో వెళ్లే వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గ్రామ సభ లు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురయ్యే ప్రాంతాలలో మ్యాపింగ్ చేయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీట్లు నిర్వహించాలన్నారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 130 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌న్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ ఈ.బాలస్వామి రెడ్డి , డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన వైఖరి


