లారీ ఢీకొని యువకుడి మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో టి.చదిపిరాళ్ల వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగంపల్లెకు చెందిన పాలెం ప్రభు కుమార్ (22) మృతి చెందినట్లు ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జంగంపల్లెకు చెందిన ప్రభుకుమార్ పందిళ్లపల్లె వద్ద ఎలక్ట్రీషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం పందిళ్లపల్లె నుంచి బైక్‌లో ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఎదురుగా వస్తున్న ఆల్వీన్ లారీ ఢీ కొంది. దీంతో ప్రభుకుమార్ కింద పడ్డాడు. ఆల్వీన్ వెనకాలే వస్తున్న కంటైనర్ సైతం ప్రభుకుమార్‌ను తొక్కి వెళ్లింది. దీంతో కాలు విరిగి తీవ్ర రక్తస్రావం అయింది. చికిత్స నిమిత్తం 108 వాహనంలో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. కాగా పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు కాంతమ్మ, చెండ్రాయుడు ఉన్నారు.


