శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగండి
● వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ పిలుపు
● ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం ప్రారంభం
కడప (వైఎస్సార్ సర్కిల్)/పులివెందుల : ఉచిత శిక్షణ కోర్సులను పేద మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగి.. కుటుంబానికి అండగా నిలబడాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్ జార్జిరెడ్డి 26వ వర్థంతిని పురస్కరించుకుని కడపలో ఇందిరా మహిళా మండలి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. పేదలకు సేవ చేయాలన్న ఆలోచనతో వైఎస్ భారతమ్మ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తనకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వినియోగించడం సంతోషదాయకంగా ఉందన్నారు. పులివెందుల, చెన్నూరు మండలాల్లో టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇచ్చామన్నారు. చెన్నూరు మండలంలో ఉచిత కోర్సుల శిక్షణతోపాటు పేద మహిళలకు కుట్టుమెషిన్లు, పాడి పశువులు ఇచ్చామని తెలిపారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన చెల్లెలు వైఎస్ విజయమ్మ అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. అనంతరం దివ్యాంగులకు దుస్తులను పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు.
వైఎస్ జార్జిరెడ్డికి నివాళి
అంతకుముందు పులివెందులలోని సమాధుల తోటలో జార్జిరెడ్డి ఘాట్‌వద్ద వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పీపుల్స్ యాక్షన్ ఇన్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడు కె.నాగేశ్వరరెడ్డి, సరస్వతమ్మ, రాజేశ్వరమ్మ, సుధ సుశీలమ్మ, రాజమ్మ, పీరమ్మ, రెడ్డి సేవా సమితి ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మప్రియ చంద్రారెడ్డి, వైఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, వెంగ మునిరెడ్డి, పార్నపల్లె నాయుడు పాల్గొన్నారు. ఆ తరువాత విజయమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి భాకరాపురంలోని వైఎస్ జార్జిరెడ్డి ఐటీఐ కళాశాలకు చేరుకుని కళాశాల ఆవరణలోని జార్జిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.


