అసాంఘిక చర్యలపై విస్తృత దాడులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. జిల్లాలో నవంబర్ నెలలో అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ జరిపిన దాడుల వివరాలను జిల్లా ఎస్పీ వివరించారు. గంజాయి విక్రయాలపై విస్తృత దాడులు నిర్వహించి 23.5 కిలోల గంజాయి, 1620 మత్తు కలిగించే మాత్రలు స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో పహారా
కడప నగరంతో పాటు జిల్లాలోని అన్ని పట్టణాల్లోని పాడుబడిన భవనాలు, బహిరంగ ప్రదేశాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించేందుకు అవకాశం ఉన్న 180 ప్రదేశాలను (హాట్ స్పాట్స్) గుర్తించి అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా ఈగల్, నార్కోటిక్ కంట్రోల్ సెల్, పోలీసు అధికారులు సంయుక్తంగా నిఘా ఉంచుతూ దాడులు చేస్తున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాలు లేదా గంజాయి గురించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియ జేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్‌పై..
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి రూ.16,84,000 స్వాధీనం చేసుకున్నామన్నారు. జూదమాడుతున్న మొత్తం 222 మందిని అరెస్టు చేసి రూ. 5,93,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మట్కా నిర్వాహకులపై దాడులు చేసి మొత్తం 19 మందిని అరెస్టు చేసి రూ. 64,520 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కోడిపందేలు ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి రూ. 6,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, అనుమానితులు, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జిల్లాలోని 5 పోలీస్ సబ్ డివిజన్లలో 580 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తున్న 200 మంది మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 81 మందిపై కేసులు నమోదు చేసి రూ.93,585 జరిమానా విధించారు. కంపెనీ ఫిట్టెడ్ సైలెన్సర్లను తీసివేసి అధిక శబ్దాలు చేస్తూ తిరుగుతున్న ద్విచక్ర వాహనాలకు చెందిన 100కు పైగా సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశామని తెలిపారు.
బహిరంగ మద్యపానంపై దాడులు
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న 354 మందిపై, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 149 మందిపై కేసులు నమోదు చేశారు. మోటారు వాహన చట్టం (ఎం.వి యాక్ట్) ఉల్లంఘించిన వాహనదారులకు 6527 కేసులు నమోదు చేసి రూ.16,16,515 జరిమానా విధించారు. జిల్లాలో ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు గుర్తిస్తే ప్రజలు వెంటనే డయల్ 112 కు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ కోరారు.
షెల్కే సచికేత్ విశ్వనాథ్, జిల్లా ఎస్పీ


