ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని బొల్లవరంలో ఆదివారం గౌరు సుజాత (42) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తలకు గాయమై ఆమె రక్తపు మడుగులో పడి ఉండటంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన గౌరు రవిశంకర్‌రెడ్డికి 2010లో చాపాడు మండలంలోని రాజువారిపేట గ్రామానికి చెందిన సుజాతతో వివాహం అయింది. పెళ్లై 16 ఏళ్లు దాటినా వారికి సంతానం లేదు. వారు కొన్నేళ్ల నుంచి మైదుకూరు రోడ్డులోని టీచర్స్‌కాలనీలో నివాసం ఉండేవారు. మూడు నెలల క్రితం బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని కాలనీలోకి సంసారాన్ని మార్చారు. రవిశంకర్‌రెడ్డికి పొలాలు ఉండటంతో గతంలో వ్యవసాయం చేసేవాడు. తర్వాత కొంత కాలం ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ వచ్చాడు. ఇటీవల అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతను ఎక్కువగా మద్యం తాగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించినట్లు తెలిపారు.
భార్య చనిపోయిందని ఫోన్ చేశాడు..
ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన భార్య సుజాత చనిపోయిందని రవిశంకర్‌రెడ్డి బంధువులకు ఫోన్ చేశాడు. సుజాత అక్కతో పాటు కొంత మంది బంధువులు వెంటనే అక్కడికి వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐలు వేణుగోపాల్, సదాశివయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే క్లూస్‌టీం అధికారులకు సమాచారం అందించడంతో వారొచ్చి ఘటనా స్థలంలో వేలి ముద్రలను సేకరించారు. సుజాతను భర్తే చంపాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఆదివారం రాత్రి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుజాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.


