పేదల కడుపు కొడుతున్న డీలర్
ప్రొద్దుటూరు : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అండతో డీలర్ పేదల కడుపు కొడుతున్నాడు.. ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పెద్దాయన బంధువు కావడంతో అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి బంధువు గురివిరెడ్డి రేషన్ డీలర్‌గా ఉన్నాడు. 81వ రేషన్ షాప్‌నకు సంబంధించి 883 రేషన్ కార్డులు ఉన్నాయి. అధికారం వచ్చిన వెంటనే గురివిరెడ్డి ఇతరులకు చెందిన రేషన్ షాప్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే సరుకుల తూకాల్లో కోతలు పెట్టడంతోపాటు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అదనంగా డబ్బు వసూలు చేస్తున్నాడు. ప్రతి కార్డుదారునికి కిలో నుంచి రెండు కిలోల వరకు బియ్యం తక్కువగా ఇస్తున్నాడు. అలాగే చక్కెర అర కిలోకు రూ.17.50 వసూలు చేయాల్సి ఉండగా రూ.20 వసూలు చేస్తున్నాడు. చాలా రోజులుగా ఈ తతంగం నడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
ఎమ్మెల్యేకు ఇలాంటివి కనిపించవా..
మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారుమునిరెడ్డి శనివారం వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా అడుగడుగునా ప్రజలు డీలర్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఫిర్యాదులు లేని డీలర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఆయన బంధువు డీలర్ చేస్తున్న అవినీతి కనిపించలేదా అని బంగారు మునిరెడ్డి ప్రశ్నించారు. ఆర్డీఓ ఇలాంటి సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.


