3 టిప్పర్లు సీజ్
ముద్దనూరు : కడప– తాడిపత్రి జాతీయ రహదారిలో శనివారం అధిక లోడ్, సరైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న 3 టిప్పర్లను విజిలెన్స్ ఽఅధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఇందులో అధిక లోడుతో వెళుతున్న ఇసుక టిప్పర్లు కూడా ఉన్నాయి.
శ్మశాన స్థలంలో మురుగునీటి
శుద్ధి కర్మాగారం ఏర్పాటు
– పార్టీలకతీతంగా పనులను అడ్డుకున్న నాయకులు, ప్రజలు
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం రోడ్డు చివరలో గల శ్మశాన స్థలంలో చేపట్టిన మురుగునీటి శుద్ధి కర్మాగారం పనులను శనివారం పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు అడ్డుకున్నారు. తమకు వేరేచోట శ్మశానస్థలం చూపించిన తర్వాతనే పనులు చేపట్టాలని తెగేసి చెప్పారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్, అర్బన్ ఎస్‌ఐ ఘటన స్థలానికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో ఆర్డీఓతో మాట్లాడాలని చెప్పి అధికారులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని 12, 15, 18 వార్డులకు సంబంధించిన ప్రజలు గత 30 ఏళ్లుగా శివాలయం సమీపంలోని 812 సర్వేనెంబరులో గల సుమారు 50 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని శ్మశానంగా వినియోగించుకుంటున్నారు. సదరు స్థలంలో గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ శ్మశానం అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రజల అవసరాల కోసం బోరు కూడా వేశారు. అయితే ఇటీవల కాలంలో బద్వేలు మున్సిపాలిటీకి మంజూరైన మురుగునీటి శుద్ధి కర్మాగారానికి రెవెన్యూ అధికారులు సదరు శ్మశాన స్థలాన్ని కేటాయించారు. రెండు నెలల క్రితం సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోగా స్థానికులు అడ్డుకున్నారు. తిరిగి రెండు రోజులుగా సుమారు 5 అడుగుల మేర శ్మశాన స్థలంలో గుంత తీసి పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దాదాపు మూడు నెలలుగా తమ కాలనీలకు చెందిన ఆరుగురు మృతదేహాలను శ్మశానస్థలంలో పూడ్చిపెట్టామని, వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. పనులను అడ్డుకున్న విషయాన్ని కాంట్రాక్టర్ ద్వారా తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి, అర్బన్ ఎస్‌ఐ సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమకు ప్రత్యామ్నాయంగా శ్మశానస్థలం చూపించేంత వరకు పనులు జరగనివ్వమని తేల్చి చెప్పారు. ఏదైనా ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చి అధికారులు అక్కడి నుండి వెనుదిరిగారు. అయితే స్థలం కేటాయించి బాధ్యతగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు ఒక్కరు కూడా ఘటన స్థలం వద్దకు రాకపోవడం గమనార్హం.
3 టిప్పర్లు సీజ్


