శ్మశానం కోసం ఇరు వర్గాల మధ్య వివాదం
మైదుకూరు : శ్మశానం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి పోలీసు, రెవెన్యూ అధికారుల రంగ ప్రవేశం చేసిన సంఘటన మైదుకూరు మండలంలో శనివారం జరిగింది. మండలంలోని నాగిరెడ్డిపల్లెకు చెందిన శివపురం పోలయ్య అనే 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు ఇద్దరూ కుమార్తెలే కావడంతో శనివారం ఉదయం బంధువులు అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామానికి దగ్గరలో ఉన్న వంక వద్ద గొయ్యి తవ్వించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని తీసుకుని గుంత వద్దకు వచ్చే సరికి పరిసర గ్రామమైన సోమయాజులపల్లెకు చెందిన వారు తమ పట్టా భూమిలో శవాన్ని ఎలా పూడుస్తారంటూ గుంతను పూడ్చి వేశారు. ఇన్నాళ్లు అదే పొలాల గుండా వంక వద్దకు మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించే వారమని, కొద్ది రోజుల కిందట తమ పొలాల గుండా వెళ్లనివ్వమని వారు చెప్పడం వల్లే గతంలో శ్మశానంగా వాడుకుంటున్న ఆ పొలాల్లోనే పోలయ్య మృతదేహాన్ని పూడ్చాలని తాము అక్కడే గుంత తీయించినట్టు నాగిరెడ్డిపల్లె వాసులు తెలిపారు. అయితే సర్వే నంబర్ 3లోని 12.72 ఎకరాల్లో 2.45 ఎకరాలు, 2.46 ఎకరాల వంతున ప్రభుత్వం తమకు 2010లో పట్టాలిచ్చిందని సోమయాజులపల్లెకు చెందిన పెరుగు బాలనాగమ్మ, పెరుగు సుబ్బమ్మ, వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాలపై ఇరువర్గాలు పట్టు విడవకుండా వాగ్వాదాలు చేసుకుంటుండటంతో ఉదయం అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి అక్కడికి చేరుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. తర్వాత సీఐ రమణారెడ్డి సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి ఇరువర్గాల వాదనలు విన్నారు. పోలీసు అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వం పట్టాలిచ్చిన భూమిలో 40 సెంట్లు మేరకు శ్మశానానికి ఇచ్చేందుకు సోమయాజులపల్లెకు చెందిన వారిని ఒప్పించారు. పోలయ్య మృతదేహాన్ని 40 సెంట్లను గుర్తించిన చోట పూడ్చేందుకు గుంత తీస్తుండగా నాగిరెడ్డిపల్లెకు చెందిన కొందరు ససేమిరా అన్నారు. పాత శ్మశానంగా వాడుకుంటున్న చోటనే శవాన్ని పూడుస్తామని పట్టుపట్టారు. సాయంత్రం అక్కడికి చేరుకున్న తహసీల్దార్ రాజసింహ నరేంద్ర నాగిరెడ్డిపల్లె వాసులకు మరొక చోట 2.50 ఎకరాల శ్మశానం ఏర్పాటు చేయిస్తామని ఇటీవలనే చెప్పినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతానికి 40 సెంట్లు గుర్తించిన చోట పోలయ్య మృతదేహాన్ని పూడ్చాలని మృతుని బంధువులకు చెప్పారు. మరోచోట శ్మశాన వాటిక ఏర్పాటు చేసే వరకు నాగిరెడ్డిపల్లె వారిని పొలాల గుండా వెళ్లనివ్వాలని అలా చేయకపోతే పట్టాలను రద్దు చేస్తామని సోమయాజులపల్లె వారిని తహసీల్దార్ హెచ్చరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం తీసుకొచ్చిన పోలయ్య మృతదేహాన్ని బంధువులు సాయంత్రం ఖననం చేశారు.
మృతదేహాన్ని ఉదయం తరలించినా
వాగ్వాదాలతో సాయంత్రం అంత్యక్రియలు


