ఎస్సీ,ఎస్టీలపై చంద్రబాబు కపట ప్రేమ
● ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి
● వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ఘన నివాళి
కడప కార్పొరేషన్ : ఎస్సీ, ఎస్టీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి విమర్శించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్థంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని, అమరావతి నడిబొడ్డున 18 ఎకరాల్లో రూ.400 కోట్లు ఖర్చు చేసి 225 అడుగుల దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తు చేశారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని కూటమి ప్రభుత్వం సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ దేశంలో విభిన్న మతాలు, జాతులు, భాషలు ఉన్నా ప్రజలంతా కలిసి కట్టుగా ఉన్నారంటే అది రాజ్యాంగం గొప్పదనమేనన్నారు. అంబేడ్కర్‌ను ఒక వర్గానికి, కులానికి పరిమతం చేయకూడదని, ఆయన విశ్వవ్యాప్తమైన నాయకుడని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు దళిత వ్యతిరేకి అని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ఆయన విగ్రహానికి దండ కూడా వేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శులు త్యాగరాజు, కె. బాబు, సుబ్బరాయుడు, మాజీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ కుమార్, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, రమేష్‌రెడ్డి, షఫీవుల్లా, ఏ1 నాగరాజు, తౌహిద్, సింధేరవి, ఎస్. బాదుల్లా, మహిళా నేతలు రత్నకుమారి, బి. మరియలు, ఎంవీ సుజిత, శ్రీదేవి పాల్గొన్నారు.


