చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్‌పరం చేస్తారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
కడప రూరల్ : టీడీపీ కూటమి ఏలుబడిలో చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు.. పీపీపీ అంటూ ప్రైవేటు వ్యక్తులకు కీలక వ్యవస్థలను కట్టబెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నడపలేక పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారేమోనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. శనివారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీలు గుప్పించి నాలుగు విడతలు రూ. 40 వేలకుగాను రూ. 12 వేలు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. రూ. 25 వేలు పలికిన అరటి టన్ను ధర నేడు రూ. వెయ్యి కూడా పలకకపోవడంతో రైతులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్య విద్యను పీపీపీ విధానమంటూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై ఈనెల 10వ తేదీన అన్ని జిల్లాల్లో మార్కెట్‌యార్డులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటి వద్ద ఆందోళన చేపడతామన్నారు. అదేవిధంగా 18వ తేదీన ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, కార్యవర్గ సభ్యులు ఎన్.వెంకట శివ, జి.వేణుగోపాల్, కేసీ బాదుల్లా, సి.సుబ్రమణ్యం, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


