కడప ఉక్కుపై ప్రభుత్వ నిర్లక్ష్యం
జమ్మలమడుగు : కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేసి, విశాఖ ఉక్కును మూసేసి, మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీకోసం గనులు ఇవ్వాలంటూ ఎంపీలు సిఫార్సులు చేస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ సంస్థలు నడపకుండా ప్రైవేట్ పరం చేయడం కోసం తాపత్రయ పడుతున్నారు.. అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన మండల పరిధిలోని కన్యతీర్థం సమీపంలో ఏర్పాటు చేసిన స్టీల్‌ప్లాంట్ శిలా ఫలకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప మహానాడులో కడప స్టీల్ ప్లాంట్‌ను జిందాల్ కంపెనీ పదిరోజుల్లో పనులు ప్రారంభిస్తుందని చెప్పారన్నారు. కానీ ఆరునెలలు దాటినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. రాజకీయ లబ్ధికోసం ఎన్నికల సమయంలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపనులు చేస్తున్నారే తప్ప పనులు చేపట్టడంలేదని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహార్, రామమోహన్, అన్వేష్, సత్యం, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, చేనేత సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ, ముంతాజ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసులు


