అన్నదమ్ముల మధ్య ఘర్షణ
బి.కోడూరు : మండలంలోని పెద్దుళ్ళపల్లె గ్రామంలో అన్నదమ్ములు ఇరువురి పొలాల మధ్య ఉన్న గట్టు విషయమై ఘర్షణ పడగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెరంగాని సుబ్బయ్య కుమారులైన సుబ్రమణ్యం, నాగసుబ్బరాయుడు శుక్రవారం తగదా పడ్డారు. సుబ్రమణ్యం పారతో దాడి చేయడంతో నాగసుబ్బరాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలో విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ కేసుల్లో
నిందితుడి అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరంలో ఐదు చోరీ కేసుల్లో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధి మృత్యుంజయకుంటలో నివాసం వుంటున్న ఉదయగిరి పెద్ద కుళ్లాయప్ప అలియాస్ లడ్డు అనే యువకుడికి ఐదు దొంగతనాల కేసుల్లో ప్రమేయముంది. ఇతను గతంలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాల కేసులు, ఒక గలాటా కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను, ఇద్దరు మైనర్లతో కలిసి కడప నగరంలోని శంకరాపురం, ఎర్రముక్కపల్లి, ఎన్జీఓ కాలనీ ప్రాంతాలలో ఐదు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా వున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇతని వద్ద నుంచి 4.5 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన స్కూటీ, సెల్‌ఫోన్‌లను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి కృషి చేసిన చిన్నచౌక్ ఇన్‌స్పెక్టర్ ఎ.ఓబులేసు గారు, చిన్నచౌక్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, పి.రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు ఖాదర్ హుస్సేన్, ప్రదీప్ కుమార్, ఓబులేసు, మాధవరెడ్డి, నాగరాజు, సుధాకర్ యాదవ్‌లను కడప సబ్ డివిజినల్ పోలీస్ అధికారి ఏ.వెంకటేశ్వర్లు ప్రశంసించి రివార్డుల కోసం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌కు సిఫార్సు చేశారు.
కడప అగ్రికల్చర్: తుపాను కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కడప, బద్వేల్, జమ్మలమడుగు డివిజన్లలో వర్షం కురిసింది. రాజుపాలెంలో 24.4 మి.మీ, చాపాడు 16.6, దువ్వూరు 16.4, పెద్దముడియం 14.2, ప్రొద్దుటూరు 13, కడప 12.4, గోవపరం 10, కమలాపురం, బద్వేలు 9.6, ఒంటిమిట్ట 9.4, జమ్మలమడుగు 7.4, మైలవరం, మైదుకూరు7.2, సిద్దవటం, పెండ్లిమర్రి 5.2, బిమఠంలో 4.2, చెన్నూరు 3.8, సికెదిన్నె 2.4, కొండాపురం, ముద్దనూరు 2.2, పోరుమామిళ్ల 2, ఖాజీపేట 1.8, వల్లూరు 1.2, ఎర్రగుంట్లలో 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దైవ దర్శనానికి వెళ్లి
వస్తుండగా..
– గుండెపోటుతో అయ్యప్ప భక్తుడి మృతి
మైదుకూరు : పట్టణంలోని నంద్యాల రోడ్డుకు చెందిన కశెట్టి సాయిచంద్ర(27) అనే అయ్యప్ప స్వామి భక్తుడు శబరిమల నుంచి తిరిగి వస్తూ గుండెపోటుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే సమీపంలోని తిరువన్నమలై మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయిందని వారు వివరించారు. చిన్న వయసులోనే తమ కుమారుడు మృతి చెందడంతో యువకుని తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.


