తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
● రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఒక రోడ్డు పని కోసం తెలుగు తమ్ముళ్లు బరి తెగించారు. తాను మంజూరు చేయించుకున్న పని తానే చేయాలని ఒక వర్గం భీష్మించుకోగా.. ఆధిపత్యం కోసం మరో వర్గం అడ్డు పడింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాలు మోహరించడంతో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు సర్ది చెబుతున్నా.. ఓ దశలో ఇరు వర్గాలు రెచ్చి పోయి రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటన శుక్రవారం చక్రాయపేట మండలం కె.రాజుపల్లెలో చోటు చేసుకొంది. చక్రాయపేటకు చెందిన కర్నాటి భరత్‌రెడ్డి కె.రాజుపల్లె వద్ద గ్రావెల్ రోడ్డును మంజూరు చేయించుకున్నారు. రోడ్డు పనులను మొదలుపెట్టేందుకు ఆయన జేసీబీ తీసుకొని రాజుపల్లె వద్దకు వెళ్లాడు. అయితే ఈ రోడ్డు విషయంలో మండల ఇన్‌చార్జి తాళ్లపల్లె మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకొని రాజుపల్లెకు చెందిన శ్రీరామిరెడ్డిని ఎగదోశారు. దీనికి తోడు మండలంలోని టీడీపీ వర్గీయులకు శ్రీరామిరెడ్డికి సహకరించాలని ఫోన్ ద్వారా మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. వేరే ఊరి నుంచి మా వూరికి వచ్చి పనులు చేయొద్దని గొడవకు దిగారు. రాళ్లు రువ్వుకున్నది రెండూ టీడీపీ వర్గాలే అయినప్పటికీ.. ఒక వర్గానికి పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా ఇరు వర్గాలు పరస్పరం వాదులాడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని తరిమి వేశారు. అయితే ఈ విషయంపై ఇరువర్గాలు ఆధిపత్యం దెబ్బతింటుందని భావించి బయటి ప్రాంతాల నుంచి మనుషులను రప్పించుకొన్నారు. మళ్లీ గొడవకు దిగి రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో తెలుగు తమ్ముళ్లకు చెందిన వాహనానికి అద్దాలు కూడా పగిలినట్లు సమాచారం. ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి ఇరువర్గాలను చెదర గొట్టారు. గొడవ సర్దుబాటు అయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో రాజుపల్లె వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.


