అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సింహాద్రిపురం : పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు రుతునూరు నాగేశ్వరరెడ్డి(63) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు నాగవర్ధన్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రైతు నాగేశ్వరరెడ్డికి 2 ఎకరాల పొలం ఉంది. ఇద్దరు కుమారులు, కుమార్తెలను చదివించి పెద్ద చేశారు. మూడు నెలల క్రితం నాగేశ్వరరెడ్డి భార్యకు క్యాన్సర్ వ్యాధి రాగా, వివిధ ఆసుపత్రులలో చికిత్స చేయించి వేలాది రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆమె బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులో కంతులు కట్టకపోవడంతో నోటీసులు ఇచ్చారు. పిల్లలను చదివించడానికి అప్పులు చేశాడు. పంటలు పండక అప్పులకు వడ్డీలు తోడై లక్షలాది రూపాయలు బాకీ పడ్డాడు. భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. బ్యాంక్ అప్పు తీర్చేందుకు డబ్బు సర్దుబాటు కాలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి నుంచి కనిపించలేదు. ఆయన కోసం కుటుంబ సభ్యులు గాలించారు. చివరికి ఊరి చివర ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వద్ద వేప చెట్టుకు ఉరి వేసుకుని శుక్రవారం కనిపించాడు. ఈ విషయాన్ని ఎస్‌ఐ రవికుమార్‌కు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగేశ్వరరెడ్డి మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గురుకులానికి నిధులు
బి.కోడూరు : మండలంలోని సగిలేరు వద్ద గల డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.75 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీడీఓ భాస్కర్‌రావు తెలిపారు. శుక్రవారం అందుకు సంబంధించి పాఠశాలలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి, పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


