అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు దుర్మార్గం
ఎన్నడూ ఆటంకాలు కలగలేదు
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం తాళ్లపాక నుంచి తిరుమలకు శేషాచలం అటవీమార్గంలో చేరుకున్న కాలిబాటపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. ఆకేపాటి ఎస్టేట్‌లో గురువారం రాజంపేట వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
22 ఏళ్లుగా అన్నమయ్య కాలిబాటలో...
తాను 22 ఏళ్లుగా అన్నమయ్య కాలిబాటలో వేలాదిమందితో కలిసి తిరుమలకు చేరుకొని, శ్రీవారిని దర్శించుకునేవారమని ఆకేపాటి తెలిపారు. అన్నమాచార్యుడు శ్రీ వెంకటేశ్వరసామిపై వేలాది కీర్తనలు రచించి, ఆలపిస్తూ ఏడుకొండలు ఎక్కారన్నారు. అన్నమయ్య నడిచిన ఆ బాటలో గోవిందమాల ధరించిన వేలాదిమందితోలేటా తిరుమలకు మహాపాదయాత్రగా చేస్తున్నట్లు వివరించారు.
తిరుమల మహాపాదయాత్రకు సిద్ధమయ్యే పరిస్ధితిలో..
ఈ ఏడు కూడా తిరుమల మహాపాదయాత్ర చేస్తున్నానని 40 రోజులు నుంచి తాను పోస్టర్లుతోపాటు విస్తృత ప్రచారం చేశానని, ఇన్ని రోజులు కాలిబాటలో వెళ్లకూడదనే అంశాన్ని అటవీశాఖ అధికారులు తీసుకురాలేదని తాజాగా రెండు, మూడు రోజుల ముందు కాలిబాటపై నిషేదాజ్ఞలు తీసుకురావడం ఏంటని అసహనం వ్యక్తంచేశారు. ఇది మంచి సంప్రదా యం కాదన్నారు. టీటీడీ జేఈవోను కలిసి తిరుమల మహాపాదయాత్రలో కొండకు చేరుకొనే గోవిందమాల ధరించిన పేదలకు దర్శనం కల్పించాలని విన్నవించానన్నారు.
ఏ ప్రభుత్వాలు ఉన్నా
కాలిబాటలో పాదయాత్ర చేశా..
ఏ ప్రభుత్వాలు ఉన్న తాను మాత్రం అనేకమంది పేదలతో కలిసి అన్నమయ్య కాలిబాటలో తిరుమల మహాపాదయాత్ర చేశానని గుర్తుచేశారు. తాను తిరుమలకు పాదయాత్ర చేస్తే అన్నమయ్య కాలిబాటలోనే వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానన్నారు. కాలిబాటలో పాదయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం శ్రీవారి భక్తులందరినీ బాధిస్తున్న అంశంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. తొలిసారిగా టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను అడ్డుకుందని వాపోయారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చే దాకా అన్నమయ్య కాలిబాట పాదయాత్ర తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లు, ఇప్పుడు విరమించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
అభివృద్ధి చేయాలన్న పవన్
ఇప్పుడు కాలిబాటపై ఆంక్షలు..
గతంలో అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయాలని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటవీశాఖ మంత్రిగా ఉన్న హయాంలో అదే అన్నమయ్య కాలిబాటలో శ్రీవారిభక్తులు వెళ్లరాదంటూ ఆంక్షలను విధించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధి చేయాలని, ఆ దారిలో అమరనాఽథ్ రెడ్డి నడిచివెళుతున్నారని పవన్ చేసిన ప్రసంగాన్ని మీడియా ఎదుట వినిపించారు.
ఇన్నేళ్ల కాలిబాట మహా పాదయాత్రలో ఎటువంటి ఆటంకాలు కలగలేదని ఆకేపాటి వెల్లడించారు. వయోభారం ఉన్న, అనారోగ్యంతో ఉన్న సరే ఏడుకొండలస్వామి తమకు అండగా ఉన్నారనే భావనలతో కాలిబాటలో నడిచి కొండకు చేరుకునేవారు తమ పాదయత్రలో ఉన్నారన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తి తమలో ఎక్కడలేని శక్తి సామర్థ్యాలను కల్పిస్తుందన్నారు. ఆ శక్తితోనే అవలీలగా కొండకు ఎక్కుతామన్నారు. టీటీడీ ఉన్నతాధికారులు సహకారంతో పేదలందరికి స్వామి దర్శనం కల్పించేశక్తిని కలియుగదైవం తనకు ప్రసాదించారన్నారు.
ఏ ప్రభుత్వం ఉన్నా పాదయాత్ర కొనసాగించాను
22 సార్లు అన్నమయ్య కాలిబాటలో వేలాదిమందితో వెళ్లా
తిరుమలకు పాదయాత్ర చేస్తే అన్నమయ్య కాలిబాటలోనే వెళతా
ప్రభుత్వం అనుమతులు ఇచ్చేదాకా పాదయాత్ర వాయిదా


