మబ్బులు.. రైతుకు గుబులు
కడప అగ్రికల్చర్: దిత్వా తుఫాన్ కారణంగా వారం రోజులుగా జిల్లాలో వరి కోతలకు బ్రేకులు పడ్డాయి. ఆకాశమంతా మబ్బులతో కూడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలామంది రైతులు వరికోతలను కోయాలంటే జంకుతున్నారు. ఇప్పటికే కోసిన వడ్లు తడి ఆరక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 55 వేల ఎకరాలకుపైగా వరికోతలు చేయాల్సిన పంట అలాగే ఉంది. తుపాన్ భయంతో వరి కోసేందుకు ఎవరూ సాహసించడం లేదు. వరి కోత మిషన్లు రోజుకు 10 వేల నుంచి 20 వేల వరకు సంపాదిస్తాయి. వారం రోజుల నుంచి మిషన్లన్నీ ఖాళీగా ఉండటంతో వారు కూడా ఉపాధి కరువై దిగాలు పడ్డారు. ఆకాశం మబ్బులు వీడి ఎండలు కాస్తే చాలా మంది రైతులు వరికోతలను ప్రారంభిస్తారు.. ఆకాశం మాత్రం మబ్బులు వీడడం లేదు. వరిధాన్యం దిగుబడులు వచ్చే సమయంలో ఈ వర్షాలు వస్తుండటంతో రైతుల్లో గుబులు పట్టుకుంది.
జిల్లావ్యాప్తంగా వర్షాలు...
జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఇందులో పెద్దముడియం మినహా మిగతా అన్ని మండలాల్లో వర్షం నమోదైంది. పెండ్లిమర్రిలో అత్యధికంగా 50.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే కడపలో 42.6, ఒంటిమిట్టలో 41.2, గోపవరంలో 38.4, బద్వేల్‌లో 36.8, సిద్దవటంలో 31.0, వేములలో 30.0, సికెదిన్నెలో 25.2, పులివెందుల్లో 25, మఠంలో 21.2, వేంపల్లిలో 20.8, వీఎన్‌పల్లి 18.4, అట్లూరులో 17.4, బి కోడూరులో 16.8, లింగాలలో 16.2, చెన్నూరులో 14.4 , చక్రాయపేటలో 13.2, తొండూరులో 12.4, వల్లూరులో 12.2, సింహాద్రిపురంలో 7.4, రాజుపాలెంలో 6.8, కొండాపురంలో 6.4, ఖాజీపేట 6.2, దువ్వూరు 6.2, మైదుకూరు 5.8, ప్రొద్దుటూరులో 5.4, ముద్దనూరులో 4.4, కలసపాడు 3.6, మైలవరంలో 3.2 , జమ్మలమడుగు 3.2 ,కాశినాయనలో 3.2 , కమలాపురంలో 2.8 మి.మీ వర్షం కురిసింది.
వారం రోజుల నుంచి ఆగిన వరికోతలు
జిల్లావ్యాప్తంగా కురుస్తున్న జల్లులు


